జగన్‌తో నా పరిచయం 22 ఏళ్లు: నటుడు అలీ | Actor Ali Special Interview on YSRCP Party And YS Jagan | Sakshi
Sakshi News home page

జగన్‌తో నా పరిచయం 22 ఏళ్లు: నటుడు అలీ

Published Wed, Mar 13 2019 7:12 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Actor Ali Special Interview on YSRCP Party And YS Jagan - Sakshi

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.  వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో విజయం సాధించి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. జగన్‌ దూరదృష్టితోపాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి పట్ల అంకిత భావం ఉన్న నాయకుడు. రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెడితే యువత భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం మైనారిటీలను రాజకీయ ఓటుబ్యాంకుగా భావించారే తప్ప వారి జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు కృషి చేయలేదు. పార్టీలో సామాన్య కార్యకర్తగా వైఎస్‌ జగన్‌ నాకు అప్పగించిన పని నిర్వర్తిసాను. 1999 ఎన్నికల్లో చంద్రబాబు కోసం ప్రచారం చేసి ఆయనకు అధికారం దక్కేలా చేశా. 2019లో వైఎస్‌ జగన్‌ తరఫున ప్రచారం చేసి ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు కృషిచేస్తా..   

సాక్షి :  మీరు వైఎస్సార్‌సీపీలో చేరాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? కారణాలు ఏమిటి?
అలీ  : 1999లో నేను చాలామంది కోసం ప్రచారం చేశా. వాళ్లు అధికారంలోకి వచ్చారు. అయితే ఆ తర్వాత నేను ఎప్పుడూ వాళ్ల దగ్గరికి వెళ్లి నాకు అది చేయండి, ఇది చేయండని అడగలేదు. ఏదీ ఆశించకుండా ప్రచారం చేశా.ఆ తర్వాత నన్ను చాలా మంది తమ పార్టీల్లో చేరమని ఆహ్వానించారు. నేను మైనారిటీని కనుక .. అలీ వచ్చేస్తే వారంతా తమ వైపు మొగ్గు చూపుతారనే స్వార్థంతోనే పిలిచారు. అయితే ఎవరో చెబితేనో, మరెవరి ఒత్తిడితోనో ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోలేదు. పూర్తి ఇష్టంతోనే వైఎస్సార్‌సీపీలో చేరా.


 సాక్షి :  మీకు దివంగత వైఎస్సార్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి?
అలీ  :  వైఎస్సార్‌ ఇంటి పక్కనే మా ఇల్లు ఉండేది. 14 ఏళ్లు ఉన్నాం. ఆ కుటుంబంతో నాకు 22 ఏళ్ల పరిచయం ఉంది. అప్పట్లో నేను వెళ్లి ఉంటే ఆయన మంత్రివర్గంలో ఒకడ్ని అయ్యే వాడిని కూడా. కానీ అప్పుడు మా పెద్దోళ్లు కొందరు ఏం చెప్పారంటే.. ఇది రాజకీయాల్లో చేరే వయసు కాదు, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పిలుస్తారు, అప్పుడు వెళ్లు.. అని సలహా ఇచ్చారు. అప్పుడు వెళితే తగిన గౌరవం దక్కుతుందని, నిన్ను వైఎస్‌ ఎప్పుడూ పరాయివాడిగా భావించరని చెప్పారు. కుటుంబ సభ్యుడిగా చూస్తారని సూచించారు. సినిమా రంగంలో గుర్తింపు ఉన్న వ్యక్తిగా నిన్ను చూడాలనిపిస్తుంది. నీ మాట వినాలనిపిస్తుంది అని పెద్దలు చెప్పిన మీదట ఆవేళ రాజకీయాలవైపు చూడలేదు. నాకు కల్మషం లేదు. నా మనసులో దురుద్దేశం ఉండదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం నా అలవాటు. నా మసస్తత్వానికి, జగన్‌ మనస్తత్వానికి దగ్గర పోలిక ఉన్నందు వల్లే వైఎస్సార్‌ సీపీలో చేరా. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ అని ఇంతకాలం అక్కడున్నా. టీడీపీ ఇప్పుడు ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ కాదని భావిస్తున్నా.
 
సాక్షి :   పార్టీలో చేరుతున్నప్పుడు జగన్‌ మీకేం చెప్పారు?
అలీ  : ఆయన ఒక మాట చెప్పారు. అలీ.. నీకు సీటు ఇస్తే ఒకచోటే ఉండిపోతావ్‌. నిన్ను ఒక్క ప్రాంతానికో, జిల్లాకో పరిమితం చేయదలచుకోలేదు. నిన్ను ప్రచారంలో పెట్టి అన్ని చోట్లా తిప్పి ఏం చేయాలనేది నాకు వదిలేయమని జగన్‌ చెప్పారు. అంతే.. నేను మరోమాట మాట్లాడలేదు. జగన్‌ మాట ఇస్తే తప్పడని నాకు తెలుసు. ఆ కుటుంబం అలాంటిది. అందుకే వచ్చా. విజయసాయిరెడ్డి నాకు ఒకే మాట చెప్పారు. అలీ నీకు జగన్‌ సంగతి తెలుసుకదా.. ఆయన మాట ఇస్తే తప్పరు అన్నారు. దానికి నేను అలాగే సర్‌ అని చెప్పా.
 
సాక్షి :  జగన్‌తో మీకు పరిచయం ఉందా?
అలీ  : జగన్‌తో నా పరిచయం 22 ఏళ్ల నాటిది. వైఎస్సార్‌ ఉన్నప్పుడు కూడా వాళ్ల ఇంటికి తరచూ వెళ్లేవాడిని. జగన్‌ను కలిసే వాడిని. ఆ సమయంలో వైఎస్సార్‌ నన్ను.. వాట్‌ హీరో? అనే వారు. వైఎస్సార్‌ నా సినిమాలు చూడకపోయినా నా గురించి చాలా మంది ఆయనకు చెప్పే వాళ్లట. అలీ హాస్యనటుడే కాదు.. దయాగుణం కూడా కలవాడని చెప్పినప్పుడు ఆయన నన్ను అభినందించిన ఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి విషయంలో భగవంతుడు ఎందుకు తొందరపడ్డాడా? అని బాధపడుతుంటా.  జగన్‌ను ప్రయాణాల్లోనో, ఎయిర్‌పోర్టుల్లోనో కలిసినప్పుడు ఎంతసేపూ ఆయన్ను నవ్వించడానికే ప్రయత్నించే వాడిని తప్ప సీరియస్‌ విషయాలు మాట్లాడలేదు.
 
సాక్షి :   మీరేదో సెంటిమెంట్‌తో ప్రచారం చేస్తారట?
అలీ  : నాకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. అవి పక్కన పెడితే.. జగన్‌ మాత్రం నిస్సందేహంగా విజన్‌ ఉన్న నాయకుడు. ఆయన వస్తారు.. కచ్చితంగా గెలుస్తాడు. ప్రజలు ఆయన్ను మళ్లీ మళ్లీ గెలిపిస్తారని నమ్ముతున్నా. నా నమ్మకం వమ్ము కాదు. ఎందుకంటే 1999లో సెంటిమెంట్‌గా తిరిగా. ఓ పెద్దాయన సీఎం అయ్యారు. (ఎవరో మీకు తెలుసంటూ నవ్వులు). మళ్లీ 2019లో అదే సెంటిమెంట్‌తో తిరుగుతా. వైఎస్‌ జగన్‌ తిరుగులేని విధంగా గెలుస్తారు. నేను నమ్మే అల్లా మీద నమ్మకం ఉంది గనుక జగన్‌ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం ఉంది.  

 
సాక్షి :  ఇటీవల వచ్చిన విమర్శల సంగతేంటి?
అలీ  :  కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెబుదామని చంద్రబాబు వద్దకు వెళ్లా. అదేదో మర్యాద పూర్వకంగా కలిస్తే దాన్ని రాజకీయం చేశారు. ఇంత ప్రమాదం ఉంటుందని తెలిస్తే అసలు కలిసే వాడినే కాదు. జగన్‌ గారితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఒక ఫోటో తీసి పోస్టు చేస్తే అది వైరల్‌ అయింది.  స్నేహం వేరు, పార్టీ వేరు, సినిమాలు వేరు. నేను నా ఇష్ట ప్రకారం నడుచుకుంటాను తప్ప ఎవరో చెప్పారని చేయను కదా. తెలుగుదేశంపై అసంతృప్తితోనే నేను వైఎస్సార్‌సీపీలో చేరా.
 
సాక్షి :  బాబు డబ్బులు పంచుతారనే మాట వినపడలేదా?
అలీ  :   విన్నా,.. అందుకే నేను వాళ్లందరికీ ఒకే మాట చెప్పా. డబ్బులు తీసుకుని ఓటు వేస్తే మీరు ఎవర్నీ ఏమీ అడగలేరు. అదే డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తే ఆ నాయకుడిని నిలబెట్టి ప్రశ్నించవచ్చు అని చెప్పా. డబ్బులు తీసుకోకపోతే మీకు (ఓటర్లకు) ఏం కావాలో దాన్ని అడగవచ్చు. డబ్బు తీసుకుంటే ఇప్పుడు వచ్చిన అనర్థాలే వస్తాయని కూడా చెబుతుంటా. ప్రజల భవిష్యత్‌ వాళ్ల చేతుల్లోనే ఉంది.  
 సాక్షి :   జగన్‌ నవరత్నాలు విన్నారా?
అలీ  :  వాటిల్లో విద్య, వైద్యం, మద్యపాన నిషేధం, రైతు భరోసా, వృద్ధాప్య పింఛన్లు, 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మహిళలకు ఆర్థిక సాయం అనేవి నాకు బాగా నచ్చాయి. ప్రజలు గ్యారంటీగా ఆలోచిస్తారు. ఇలాంటి పథకాలు చాలా అవసరం అని అనుకుంటారు. ఇలాంటి నాయకుడు అధికారంలోకి వస్తే మన బతుకులతో పాటు మన పిల్లల భవిష్యత్‌ బాగుంటుందని ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రజలు ఇంతకు ముందులా లేరు. ఆలోచించి ఓటు వేస్తారు. ఓటును వజ్రాయుధంగా భావిస్తున్నారు.  
 
సాక్షి :   ఓట్ల తొలగింపుపై ఏమైనా..?
అలీ  :   ఓటు వజ్రాయుధం. అవగాహన పెరిగింది. ఓటు హక్కు కలిగిన వారందరూ కచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఓట్లను తొలగిస్తున్నారంటూ ఇటీవల రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దాన్ని ఓ కంట కనిపెట్టాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం.

సాక్షి :    రాష్ట్రం వెనుకబడిందని భావిస్తున్నారా?
అలీ  :  రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. చంద్రబాబు చెప్పిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి ఉంది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చ లేదని ప్రజలు భావిస్తున్నారు. గతంలో చేయనివాళ్లు ఇప్పుడు ఏం చేస్తారు? ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మన భవిష్యత్‌ ఏమిటి? అని ప్రజలు ఆలోచిస్తున్నారు. మార్పు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి జగన్‌ వస్తే కచ్చితంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది నెరవేరుతుందని నా నమ్మకం. అది చేసే మగాడు కూడా ఆయనే.
 
సాక్షి : మైనారిటీలకు చంద్రబాబు చేసిన అన్యాయంపై...?
అలీ  : మైనారిటీలు చంద్రబాబు ఏమీ చేయలేదన్న అసంతృప్తితో ఉన్నారు. తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్న భావన ఉంది. అందువల్లే మైనారిటీలు ఈసారి వైఎస్సార్‌ సీపీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో మైనారిటీలకు ఒక్క పదవి కూడా  లేకపోవడాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఏడాదికోసారి వస్తారు.. టోపీ తొడుక్కుంటారు... పండగ పూటో, రంజాన్‌కో వస్తారు.. నోట్లో ఒక స్వీటు పెడతారు.. వెళ్లిపోతారు.. ఇంతేనా మా జీవితాలు? ఇక మాకేమీ పదవులు ఉండవా..? అనేది మైనారిటీలలో బాగా నాటుకుపోయింది.  చివరకు మాలాంటి వాళ్లం కూడా ఏమీ చేయలేకపోయాం. గతంలో గుంటూరులో అన్యాయాన్ని ప్రశ్నించినందుకు రంజాన్‌ మాసం అని కూడా చూడకుండా 150 మంది మైనారిటీలపై కేసులు పెట్టారు. కొందరిమీదనైతే దేశ ద్రోహం కేసు కూడా పెట్టారు. వాళ్లిప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే తల్లిదండ్రులు ఎంత క్షోభ పడుతున్నారో తెలుసా? వైఎస్సార్‌ సీపీ వాళ్లు ఆ మైనారిటీల తరఫున పోరాడారు. మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి సీట్లు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్సార్‌సీపీయే. తెలంగాణలో కేసీఆర్‌ ఒక మైనారిటీని ఉప ముఖ్యమంత్రిని చేస్తే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మేం దేనికీ పనికి రామా? మైనారిటీలుగా పుట్టడమే మేం చేసిన తప్పా? ఓట్లకు తప్ప దేనికీ పనికిరామా?  

 
సాక్షి :   ప్రజలకు మీరిచ్చే సందేశం?
అలీ  :  మార్పు కోసం ఓటేయండి. జగన్‌ సీఎం అయితేనే మార్పు వస్తుంది. నేను నమ్మే సిద్ధాంతం అది. ప్రజలు తమ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవాలి.

సాక్షి :  జగన్‌పై మీకు అంత నమ్మకం ఏమిటి?
అలీ  :  జగన్‌ అందరిలాంటి వాడు కాదన్నది నా నమ్మకం. ఆయన మాట ఇస్తే వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. రాష్ట్రాభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నారు. అందరి క్షేమాన్ని చూస్తాడన్న భరోసా ఉంది. యువత కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఏ పథకాలు ప్రవేశపెడితే రాష్ట్రం బాగుంటుందనే దానిపై జగన్‌ ఆలోచన చేస్తున్నారు. విజన్‌ ఉన్న నాయకుడు ఆయన. డాక్టర్‌ వైఎస్సార్‌ వారసత్వాన్ని కొనసాగిస్తారన్న నమ్మకం ఉంది.  

సాక్షి :   ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై మీరేమనుకుంటున్నారు?
అలీ  : షూటింగ్‌ల పని మీద ఇటీవల రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు వెళ్లా. అక్కడ వాళ్లను అడిగినప్పుడు చెప్పిందేమిటంటే.. ఏదో చేస్తారని ప్రస్తుత పాలకులను గెలిపిస్తే ఇంకేదో జరిగిందని బాధ పడుతున్నారు. ఎందుకు చేయలేదు? అని వాపోతున్నారు. అభివృద్ధి కనపడడం లేదని చెబుతున్నారు. మోసపోయామన్న భావనలో ఉన్నారు. ఈ మాట చెప్పిన వాళ్లలో చాలామంది ఆడవాళ్లు ఉన్నారు. రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి లేదండీ అని బాధపడుతున్నారు. ఏదో ఆశ పడితే మరేదో జరిగిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారని అడిగితే వాళ్లందరూ ముక్తకంఠంతో జగన్‌ వస్తే బాగుంటుందని చెప్పారు. కనుక ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జగన్‌ వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement