
సాక్షి, చెన్నై : నటుడు విశాల్ సోమవారం తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశాడు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్ సెంటర్‌కు వెళ్లిన అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శమని ప్రకటించిన విశాల్.. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్ ప్రజలను కోరుతున్నాడు.
ఇక విశాల్ రాక నేపథ్యంలో నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అక్కడికి చేరుకోగా.. భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ కూడా తమలాగే మాములు వ్యక్తి అని.. అతని కోసం ఎదురు చూడాల్సిన అవసరం తమకు లేదంటూ వారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ఫ తోపులాట చోటు చేసుకోగా.. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్య ర్థిగా మదుసూదనన్, అన్నాడీఎంకే బహిష్కృత దినకరన్( అన్నాడీ ఎంకే అమ్మ పార్టీ తరపున), బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళనాట క్రేజ్ సంపాదించుకున్న మాస్ హీరో విశాల్ బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment