
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఇక్కడ కంటివెలుగు పరీక్షలు నిర్వహించి, కేసీఆర్ తన కళ్లను పరీక్షించుకునేందుకు మాత్రం ఢిల్లీ వెళ్లారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ ఎద్దేవా చేశారు. కంటి పరీక్షల కోసం ఢిల్లీ పెద్దలంతా హైదరాబాద్ వస్తుంటే, కేసీఆర్ మాత్రం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాడని ఆయన విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాష్కీ మాట్లాడుతూ మోదీ ప్రేమలో గుడ్డివాడయిన కేసీఆర్‌కు సీమాంధ్రులంటే నచ్చదని, ఎల్వీప్రసాద్ ఆసుపత్రి ఆంధ్ర వాళ్లది అయినందునే ఢిల్లీ వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారని ఆరోపించారు.
అధికారం కోసం గడ్డితినే కేసీఆర్ కుటుంబాన్ని సీమాంధ్రులు నమ్మవద్దని, టీఆర్‌ఎస్ నేతల బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని అన్నారు. సీమాంధ్రులకు తాము అండగా ఉంటామని, టీఆర్‌ఎస్ బెదిరింపులు, దాడులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment