సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (ఫైల్ ఫొటో)
లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఖాళీ చేసిన బంగ్లాలోని విలువైన వస్తువులు మాయమయ్యాయని ప్రభుత్వ అధికారులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలపై ఆయన స్పందించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తన పరువు తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మీడియాను తీసుకురావడానికి ముందే ముఖ్యమంత్రి ప్రత్యేక పరిరక్షణ విధుల అధికారి అభిషేక్ ఫోన్‌తో సహా తన బంగ్లాకు వెళ్లారన్నారు.
మీడియా వచ్చిన తర్వాత ఇంటిలోని వస్తువులు మాయమయ్యాయంటూ ఫొటోలు తీయించడం ఆయన స్క్రిప్ట్‌లో భాగమేనన్నారు. మీడియా కూడా ఈ కుట్రలో ప్రభుత్వానికి సహకరించిందని ఆరోపించారు. తన సొంత డబ్బుతో కొన్న, తనకు సంబంధించిన వస్తువులను మాత్రమే ఇంటి నుంచి తీసుకెళ్లానని అఖిలేశ్ తెలిపారు.
కాగా అఖిలేశ్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా గవర్నర్ రామ్ నాయక్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ విషయంపై స్పందించిన అఖిలేశ్.. రామ్‌నాయక్ స్వతహాగా మంచి వ్యక్తి అని.. కాకపోతే అప్పుడప్పుడూ ఆరెస్సెస్ ఆత్మ ఆయనలో ప్రవేశించి ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల ఆయన వైఖరిని మారుస్తుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment