హోదా కోసం.. దారులన్నీ దిగ్బంధం | All the National Highways Blocked with YSCRP protest at AP | Sakshi
Sakshi News home page

హోదా కోసం.. దారులన్నీ దిగ్బంధం

Published Wed, Apr 11 2018 1:28 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

All the National Highways Blocked with YSCRP protest at AP - Sakshi

ఒంగోలులో...

సాక్షి, నెట్‌వర్క్‌: ప్రత్యేక హోదా పోరు ఉధృత రూపం దాల్చింది. హోదా సాధనే ధ్యేయంగా ఎంపీ పదవులను త్యజించి ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్‌సీపీ నేతలకు సంఘీభావంగా మంగళవారం ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళన విజయవంతమైంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతీయ రహదారులను దిగ్బంధించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రతిధ్వనింపజేశారు. ఎక్కడికక్కడ రహదారులపై మానవహారాలు, వంటావార్పు, భిక్షాటన, బైక్‌ ర్యాలీలు తదితర రూపాల్లో తమ నిరసన తెలియజేశారు.

రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల దారిలోనే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రహదారుల దిగ్బంధంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారు. అయినా మొక్కవోని దీక్షతో రాస్తారోకో విజయంతం చేసిన ప్రజలు, పార్టీ శ్రేణులు బుధవారం రైల్‌ రోకోలు విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఆందోళనకారులపై పోలీస్‌ జులుం..
కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు జాతీయ రహదారులపై ఆందోళనకు దిగగా.. పోలీసులు జులుం ప్రదర్శించారు. నందిగామలో ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పార్టీ నేత మొండితోక జగన్‌మోహన్‌తో పాటు పలువురిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పార్టీ శ్రేణుల ఆందోళనతో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ నేతలు తన్నీరు నాగేశ్వరరావు, ఇంటూరి రాజగోపాల్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగరంలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో శ్రేణులు రాస్తారోకోకు దిగాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.

మరోవైపు ప్రకాశం జిల్లాలో ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీకి ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ఒంగోలులో హైవేను దిగ్బంధించిన పార్టీ నేతలపై పోలీసులు బలప్రయోగానికి దిగారు. బలవంతంగా వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మహిళలు అడ్డుకున్నారు. వారిన సైతం పోలీసులు పక్కకు ఈడ్చేసి తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చీరాలలోనూ ఆందోళనకారులను పోలీసులు బెదిరించారు. మార్కాపురంలో ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో హైవేల దిగ్బంధనం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో హోదా నినాదం మార్మోగింది. పొదలకూరులో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పార్టీ నేతలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, మేరిగ మురళీధర్‌ తదితరుల ఆధ్వర్యంలో హైవేల దిగ్బంధనం విజయవంతమైంది. గుంటూరు జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేతలు మర్రి రాజశేఖర్, అంబటి, లేళ్ల అప్పిరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, క్రిస్టినా, లావు రత్తయ్య, బొల్లా బ్రహ్మనాయుడు తదితరుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ రహదారుల దిగ్బంధం, రాస్తారోకోలు జరిగాయి.  

కడప శివారులో జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు 

హోదా మా హక్కు..
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ వాసులు నినదించారు. ఏయూలో విద్యార్థి విభాగం నేతలు బి.కాంతారావు, సురేశ్‌కుమార్‌తో పాటు విద్యార్థులు చుక్కా క్రాంతి, చిరుపల్లి చినబాబు చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. వీరిలో సురేశ్, చినబాబుల ఆరోగ్యం క్షీణించింది. వైఎస్సార్‌సీపీ నేతలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్‌ తదితరుల నేతృత్వంలో హైవేల దిగ్బంధం విజయవంతమైంది. ఎన్‌ఏడీ జంక్షన్, గురుద్వారా కూడలిలో ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగి పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరకులో నలుగురు గుండు గీయించుకొని నిరసన తెలిపారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో హోదా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.

జాతీయ, ప్రధాన రహదారులను కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున దిగ్బంధించారు. మండపేట, కడియంలో పార్టీ నాయకులు ఆమరణ దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, పార్టీ నేతలు కన్నబాబు, వీర్రాజు తదితరుల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానికి పోస్టుకార్డులు రాసి పంపించారు. పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరులో ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. పార్టీ శ్రేణుల ఆందోళనకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. నేతలు కొయ్యే మోషన్‌రాజు, గ్రంథి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, తెల్లం బాలరాజు, గుణ్ణం నాగబాబు, కోటగిరి శ్రీధర్, తానేటి వనిత, కవురు శ్రీనివాస్, పుప్పాల వాసు, ఎలీజా, నర్సింహరాజు తదితరులు ధర్నాల్లో పాల్గొన్నారు. కొయ్యలగూడెం, నిడదవోలులో బైక్‌ ర్యాలీ నిర్వహించగా.. పెంటపాడు ఎంపీటీసీ పోతంశెట్టి లక్ష్మి ఆమరణ దీక్షకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలో ఆందోళకు దిగిన 79 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి.. కేసులు నమోదు చేశారు. పార్టీ సీనియర్‌ నేతలు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతితో పాటు నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో శ్రేణులు ఆందోళనకు దిగాయి. విజయనగరం జిల్లాలో 26వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించి.. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, నేతలు బొత్స అప్పలనర్సయ్య, పెనుమత్స సాంబశివరాజు, బెల్లాన చంద్రశేఖర్‌ తదితరులు ఆందోళనకు దిగారు. 

కర్నూలులోని కర్నూలు–కడప జాతీయ రహదారిపై బైఠాయించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌  నాయకులు ​​​​​​​
​​​​​​​

మోకాళ్లపై కూర్చొని నిరసన..
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఆటోమొబైల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎస్వీ వర్సిటీ విద్యార్థులు రాస్తారోకో, రిలే దీక్షలు చేపట్టారు. వీరికి రిటైర్డ్‌ ప్రొఫెసర్లు మద్దతు పలికారు. ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వరంలో పార్టీ శ్రేణులు రహదారులను దిగ్బంధించాయి. కర్నూలు జిల్లా ఆలూరులో ఎమ్మెల్యే జయరాం ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌–167పై ఆందోళనకు దిగిన పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు–హైదరాబాద్‌ హైవేను బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి తదితరులు దిగ్బంధించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి నేతృత్వంలో కర్నూలు–కడప రోడ్డుపై ఆందోళనకు దిగారు.

ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ మద్దతు పలికింది. అనంతపురం జిల్లాలోని తపోవనం వద్ద ఎన్‌హెచ్‌–44పై నేతలు ఆందోళన నిర్వహించారు. తాడిపత్రిలో పార్టీ నేతలు పైలా నరసింహయ్య, ఓబుళరెడ్డి, బాణా నాగేశ్వరరెడ్డి, కాశీ మనోజ్‌ చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేతలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, రాగే పరుశురాం, శంకర నారాయణతో పాటు సమన్వయ కర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడప శివారులోని కర్నూలు– చిత్తూరు హైవేపై మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజద్‌బాష, రవీంద్రనాథ్‌రెడ్డి బైఠాయించారు. ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, నేతలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వెంకట సుబ్బయ్య తదితరులు రహదా రులను దిగ్బంధించి హోదా నినాదాన్ని హోరెత్తించారు. ఎర్రగుంట్లలో సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిగింది.  

విశాఖ జిల్లా యలమంచిలిలో... 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement