
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూమిని లాక్కుని ప్రజావేదిక నిర్మించిందని, చంద్రబాబు అండతో కరకట్టపై అక్రమ కట్టడాలు చేపట్టారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చట్టానికి తూట్లు పొడిచారని విమర్శించారు. అక్రమ కట్టడాలతో నదీ గర్భం కలుషితమవుతోందని, కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని స్పష్టం చేశారు.
అక్రమ కట్టడాలపై ముందునుంచి న్యాయపోరాటం చేస్తున్నామని, కరకట్టపై 60పైగా అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా అందాయన్నారు. కేసు కోర్టు ముందుకు రాకుండా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని ఆరోపించారు. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేని, ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా చంద్రబాబు ఖాళీ చేయడం మంచిదన్నారు. మిగిలిన వాళ్లు కూడా తమకు తాముగా ఖాళీ చేయాలని సూచించారు. ప్రజా ధనంతో హైదరాబాద్‌లోనూ ఇళ్లు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. (చదవండి: ప్రజావేదిక కూల్చివేత)
Comments
Please login to add a commentAdd a comment