
సాక్షి, గుంటూరు : రాజీనామా అనే పదం చాలా చిన్నది కానీ, దాని పర్యవసానం చాలా పెద్దదని వైఎస్సార్ సీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. అయినప్పటికీ ఏపీ ప్రజల కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని ఆర్కే గుర్తుచేశారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా రాజీనామా చేసిన ఎంపీలను ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. గుంటూరులో ఎమ్మెల్యే ఆర్కే శుక్రవారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. 2014లో తన ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ నేతలు ఎంత దారుణాలకు పాల్పడ్డారో రాష్ట్రం మొత్తం చూసిందన్నారు.
నాలుగుసార్లు రీ కౌంటింగ్ చేయించినా తానే గెలిచానని, ప్రజల మద్దతు వల్లే తన విజయం సాధ్యమైందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు గట్టిగా నిలబడటం వల్ల ఫలితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అందుకే ప్రతి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి 175 నియోజక వర్గాల్లో ఉంటే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు ఏజెంట్లను కొనడం కష్టమేమీ కాదని ఎద్దేవా చేశారు. అలాంటి కుయుక్తులను ఎదుర్కొనేలా మనం వ్యవహరించాలంటూ ఎమ్మెల్యే ఆర్కే పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment