చంద్రబాబు ఇల్లు ఎందుకు కట్టలేకపోయారు? | Ambati Rambabu: Chandrababu Trying To Controversy In Amravati | Sakshi
Sakshi News home page

ఇల్లే కట్టలేని వ్యక్తి రాజధానిని ఏం నిర్మిస్తాడు: అంబటి

Published Fri, Nov 29 2019 12:42 PM | Last Updated on Fri, Nov 29 2019 2:58 PM

Ambati Rambabu: Chandrababu Trying To Controversy In Amravati - Sakshi

సాక్షి, తాడేపల్లి : రాజధానిలో ఇల్లే కట్టలేని వ్యక్తి ఇక రాజధానిని ఏం నిర్మిస్తాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అమరావతి మీద అంత ప్రేమ ఉంటే రాజధానిలో ఇల్లు ఎందుకు కట్టకోలేదని ప్రశ్నించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో చంద్రబాబు అనేక మోసాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఏ దేశం వెళ్తే ఆ దేశ రాజధాని తరహాలో రాజధాని నిర్మిస్తామని అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి పర్యటనలో ఆయనపై రాళ్లు, చెప్పు వేయడానికి కిరాయి రౌడీలు అవసరమా.. ఎవరో కడుపు మండిన వాడు రాయి, చెప్పు వేసి ఉంటాడని దుయ్యబట్టారు. రాజధానిలో రైతులపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై అన్యాయంగా కేసులు పెట్టారని, అందుకే వాళ్లు కడుపు మంటతో నిరసన తెలిపారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో వివాదం చేయాలని ప్రతిపక్షనేత చంద్రబాబు చూస్తున్నారని, కోడెల శివప్రసాద్‌రావు మరణం, ఇసుక విషయంలో కూడా ఇలానే చేశారని ఆయన విమర్శించారు. అమరావతిని చంద్రబాబు ఒక భ్రమరావతిగా మార్చాడని, రాజధానిలో వేల కోట్ల అవినీతి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ కమిటీ వేశామని స్పష్టం చేశారు. రాజధానిలో రూపాయి ఖర్చు చేసి పది రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించారని దుయ్యబట్టారు. అమరావతి అద్భుతమైన రాజధాని అయితే శాశ్వత బిల్డింగ్‌లు ఎక్కడ ఉన్నాయని, అసలు అమరావతిలో ఏం కట్టించావని బాబును నిలదీశారు. రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, పంటలు తగలబెట్టారని విమర్శించారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ వస్తే నల్ల రిబ్బన్‌ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు సాష్టాంగ నమస్కారం పెట్టారని.. మోదీకి భయపడి పెట్టారా అని ప్రశ్నించారు. బాబు ఎన్ని నమస్కారాలు పెట్టిన ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. రాజధానిలో అభివృద్ధి ఏం జరగలేదని.. కేవలం గేదెలు, గొర్రెలు మేస్తున్నాయని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement