సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు మరోసారి మోసపూరిత వేషాలు వేస్తున్న సీఎం చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం నమ్మరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేక మోసం చేశారని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దీనికి తోడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణమైన చంద్రబాబు మళ్లీ అఖిలపక్షం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని వక్రీకరిస్తూ కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మరో డ్రామాకు తెర లేపారని విమర్శించారు. విభజన హామీలపై ఉండవల్లి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో టీడీపీ, జనసేన సమక్షంలో మేం కూర్చుని చర్చించలేమని ఆయన తేల్చి చెప్పారు.
5% రిజర్వేషన్ పేరుతో కాపులను దగా..
కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నానని, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని బాబు డ్రామాలాడుతున్నారని అంబటి ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లు అనుభవించలేని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా అందులో 5 శాతం కాపులకు ఇస్తానని చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే చట్టాలను వక్రీకరించి చట్ట వ్యతిరేకంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
పోస్టు డేటెడ్ చెక్కుల పేరుతో మోసం..
పసుపు–కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చెక్కులు ఎన్నికల సమయంలో చెల్లవని, ఓట్ల కోసం మహిళలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు.
ధర్మ పోరాట దీక్షలు కావు.. దగా దీక్షలు
ప్రత్యేక హోదా డిమాండ్‌ను నీరుగార్చిన వ్యక్తులే ఇప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామనడం విడ్డూరంగా ఉందని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 8, 2016న ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ అద్భుతంగా ఉందని ఆ రోజు చంద్రబాబు చెప్పి హోదాను పోగొట్టారని, ఇప్పుడు మమ్మల్ని అఖిలపక్షానికి పిలుస్తారా అని నిలదీశారు. చంద్రబాబు డ్రామాలతో నడిచే సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ పాల్గొనదని తేల్చి చెప్పారు. కాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లపోవడానికి కారణాలను అంబటి వివరించారు. రాష్ట్రానికి హోదా రాకుండా సర్వనాశనం చేసిన టీడీపీ, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సపోర్టు చేసిన జనసేన హాజరయ్యే సమావేశానికి తాము వెళ్లలేమన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు తాము వ్యతిరేకం కాదన్నారు.
ప్రజల మైండ్ సెట్ మార్చేందుకు..
బోగస్ సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీని దెబ్బతీయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అంబటి విమర్శించారు. ప్రజల మైండ్ సెట్ మార్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. వీటిని ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. లగడపాటి రాజగోపాల్, ఓ పత్రికా చానల్ అధిపతి చంద్రబాబుతో రాత్రి మంతనాలు జరిపారన్నారు.
చంద్రబాబును నమ్మొద్దు ...!
Published Wed, Jan 30 2019 4:35 AM | Last Updated on Wed, Jan 30 2019 4:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment