పట్నా : బీహార్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలకు బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. ‘బిహార్ జనసంవాద్’ పేరిట ఆదివారం వర్చువల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, దీనికి బీహార్ ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కరోనాపై పోరు కోసం ప్రజలందరిని మమేకం చేయడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హయంలో గత ఆరేళ్లలో సాధించిన ఘనతలను వివరించారు.
(చదవండి : ‘భారత్ ఏ దేశం ముందూ తలవంచదు’)
‘ఇది ఎన్నికల ర్యాలీ కాదు. కరోనాపై పోరు కోసం ప్రజలందరిని మమేకం చేయడమే దీని ఉద్దేశం. కరోనా వారియర్స్‌కి చేతులెత్తి మొక్కుతున్నా. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి కోవిడ్-19పై పోరాడం చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇలాంటి సభలను మరిన్నిటిని నిర్వహిస్తాం. లాక్‌డౌన్‌పై ప్రధాని చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు ధిక్కరించినప్పటికీ.. ప్రజలు పాటించారు. వలస కార్మికులను తరలించడానికి ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేశాం. గత ఆరేళ్లలో ప్రధాని మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సీఏఏను అమల్లోకి తేవడంతోపాటు, పేదలకు విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేయడం, మరుగు దొడ్ల నిర్మాణం, పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేయడం, ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలను బీజేపీ ప్రభుత్వం తీసుకుంది’ అని అమిత్ షా వివరించారు.
ఇప్పటికైనా మోదీ మాట విన్నారు
బీజేపీ నిర్వహించిన ర్యాలీని వ్యతిరేకిస్తూ ఆదివారం ప్రతిపక్ష ఆర్జేడీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ‘గరీబ్ అధికార్ దివస్’ పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆర్జేడీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌తో మరికొందరు నేతలు ప్లేట్లు వాయిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనిపై అమిత్‌షా తనదైన శైలీలో చురకలు అంటించారు. ఆర్జేడీ పేరు కానీ, తేజస్వీ పేరు కానీ ప్రస్తావించకుండా నేరుగా వారిపై విమర్శలు గుప్పించారు. ‘కొంత మంది వ్యక్తులు ఈరోజు చప్పట్లు కొడుతూ కనిపించారు. కోవిడ్-19పై పోరాడుతున్న వారి పట్ల కృతజ్ఞతాభావంతో చప్పట్లు కొట్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును ఎట్టకేలకు స్వాగతించినందుకు ధన్యవాదాలు’అని వీడియో అమిత్ షా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment