కశ్మీర్‌పై షా కీలక భేటీ.. రేపు కేబినెట్‌ సమావేశం! | Amit Shah Meeting With Nation Security Committee | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌పై షా కీలక భేటీ.. రేపు కేబినెట్‌ సమావేశం!

Published Sun, Aug 4 2019 1:30 PM | Last Updated on Sun, Aug 4 2019 4:33 PM

Amit Shah Meeting With Nation Security Committee - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జతీయ భద్రతా వ్యవహారాల కమిటీతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, కార్యదర్శి రాజీవ్‌గౌబాతో ఆదివారం పార్లమెంట్‌లో అమిత్‌ షా సమావేశం అయ్యారు. వీరి భేటీలో కశ్మీర్‌పై అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కమిటీతో భేటీ అయిన షా.. రేపు కేంద్ర కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనితో పాటు త్వరలోనే కశ్మీర్‌ పర్యటనకు అమిత్‌ షా కూడా వెళ్లనున్నారు. ప్రస్తుతం లోయలో ఉద్రిక్త వాతావరణం ఉన్న విషయం తెలిసిందే.  ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  ఉగ్రముఠా దాడి హెచ్చరికలతో అక్కడి పర్యాటకులను, అమర్‌నాథ్‌ యాత్రికులను ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. మరోవైపు ఇతర దేశాలు కూడా కశ్మీర్‌ వెళ్లే పర్యటకులకు ప్రయాణాన్నివాయిదా వేసుకోవాలని సూచిస్తున్నాయి.

కాగా ఇ‍ప్పటికే లక్షకు పైగా సిబ్బందిని కశ్మీర్‌కు తరలించిన కేంద్రం.. అవసరమైతే మరికొన్ని బలగాలను కూడా తరలించేందుకు సిద్ధంగా ఉంది. దీనిపై ఆందోళన వ్యక్త చేస్తోన్న స్థానిక రాజకీయ పార్టీ ప్రతినిధులతో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇప్పటికే సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరంలేదని, వదంతులను నమ్మవద్దని వారికి సూచించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మంత్రి మండలి సమావేశంలో తీసుకునే నిర్ణయంపై  ఉత్కంఠ నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement