ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జే షాతోపాటు ఆయన కుటుంబసభ్యులు చేసిన కోట్లాది రూపాయల అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి రాకముందు జే షా నడుపుతున్న టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ నష్టాల్లో ఉందని, అయితే మోదీ ప్రధాని అయ్యాక ఈ కంపెనీ 16 వేల రెట్లు లాభాలు ఆర్జించిందని ఆరోపించారు. 2013 వరకు రూ.50 వేల ఆదాయంతో ఉన్న ఈ కంపెనీ ఒకే ఏడాదిలో రూ.80 కోట్లకు ఎలా అభివృద్ధి చెందిందో మోదీ, అమిత్ షాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇతర పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ పేర్లతో వేధింపులకు గురిచేస్తూ.. అవినీతి నిర్మూలనపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బీజేపీ నాయకులు ఇప్పుడు ఆధారాలతో సహా అవినీతి బయటపడ్డా ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. అన్నదాతలకు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకురాని సహకార బ్యాంకులు కోట్ల రూపాయలు షా కుటుంబానికి రుణాలు ఇచ్చాయని.. ఇదేనా రైతులపై ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. ధర్నాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, దానం నాగేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్, రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్లకు తరలించి అనంతరం విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment