సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. బీజేపీ మిత్రక్షాులైన టీడీపీ, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు రూపొందించినట్లు ఉందన్నారు. బిహార్‌కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.
‘2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్, కానీ కొత్త రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసింది. 2014 తర్వాత మొదటిసారిగా, బడ్జెట్‌లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ ఆర్థిక 58 పేజీలు, 14,692 పదాలున్న తన మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఖండింస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం, ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించాం
పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం
'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలి.
రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించింది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment