
సాక్షి, అమరావతి: ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 11, 12, 16, 17, 18, 19 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. వివిధ అంశాలపై మధ్యాహ్నం 2.30 గంటలకు వరకు చర్చ జరిగింది. తర్వాత శాసనసభ సోమవారంకు వాయిదా పడింది. ఈరోజు నుంచి ప్రారంభమైన శాసనమండలి సమావేశాలు కూడా సోమవారానికి వాయిదా పడ్డాయి.
కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సభ నుంచి బహిష్కరించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది.