
ఆర్‌అండ్‌బీ గెస్టహౌస్ వద్ద బీజేపీ, టీడీపీ కార్యకర్తలు
అనంతపురంలోని ఆర్ అండ్ బీ గెస్టహౌస్ వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది.
సాక్షి, అనంతపురం : అనంతపురంలోని ఆర్ అండ్ బీ గెస్టహౌస్ వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గురువారం ముట్టడించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు టీడీపీ జెండాలను తగులబెట్టారు. అంతేకాకుండా టీడీపీ కార్యక్తరలపై బీజేపీ నేతలు దాడిచేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నేతల దాడితో ముట్టడికి యత్నించిన టీడీపీ కార్యకర్తలు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనతో చంద్రబాబుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దౌర్జన్యాలను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
టీడీపీ కుట్ర
టీడీపీ కార్యకర్తల ముట్టడిపై కన్నా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తిరుపతి పర్యటనలో అమిత్ షా హత్యకు టీడీపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇపుడు వాస్తవాలు మాట్లాడుతున్న తనపై హత్యాయత్నం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం టీడీపీ గూండాలకు సహకరించారని మండిపడ్డారు. సీఎం రమేష్ కమీషన్ల కోసం హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్నారు.