చంద్రబాబు, ఎల్వీ సుబ్రహ్మణ్యం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. అయితే, తన అదుపాజ్ఞల్లో ఉండే అధికారులను బదిలీ చేయడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. నూతన సీఎస్ కోవర్టు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిపై కూడా బెదిరింపులకు దిగారు. కాగా, ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్వీ సుబ్రమణ్యంపై బాబు అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు ఐఏఎస్ అధికారులు ఏపీ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ హరిత హోటల్‌లో సమావేశమయ్యారు. రాజకీయ నాయకుల వల్ల ఐఏఎస్ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు ప్రధానంగా చర్చించనున్నారు. బాబు అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశంలో ఐఏఎస్ జవహర్‌రెడ్డి, జేఎస్వీ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రసన్న వెంకటేష్, పి.ఉషాకుమారి, కరికల్ వలవన్, సునీత శామ్యూల్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. బాబు వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment