సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ప్రజావేదికలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోలింగ్ రోజు సీఎస్.. డీజీపీ కార్యాలయానికి వెళ్లిడం ఏమిటని ఆక్షేపించారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అని నిలదీశారు. సీఎస్ తనకు నచ్చని పనులు ఎలా చేస్తారని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్న వ్యక్తి... డీజీపీ కార్యాలయానికి ఎలా వెళతారంటూ చంద్రబాబు తప్పుబట్టారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని, తన జీవితంలో ఇంత పనికిమాలిన ఎన్నికల సంఘాన్ని చూడలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరి ఊహకూ అందనంత సైలెంట్ వేవ్ ఉందని చంద్రబాబు చెప్పారు. అది జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఉంటుందా? అని ప్రశ్నించారు. సాధారణంగా పోలింగ్ మొదట్లో మందకొడిగా సాగి, ఆ తర్వాత పుంజుకుంటుందని, ఈసారి దీనికి భిన్నంగా ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. 31 శాతం ఈవీఎంలు పనిచేయలేదని చెప్పారు. ఈవీఎంల సరిచేసిన తర్వాత హింసను ప్రేరేపించారని ఆరోపించారు.
ఈవీఎంలు రిపేర్ చేస్తామని వచ్చిన వారు రిపేర్లు చేస్తున్నారా..? ట్యాంపర్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైనా జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఇప్పుడు జరిగింది ఎన్నిక కాదని ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమని, మోడీ, జగన్, కేసీఆర్ వంటి వారితో పోరాడాల్సి వచ్చిందన్నారు. టీడీపీని టార్గెట్ చేసుకుని చాలా చోట్ల దాడులు చేశారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇవన్నీ జరిగాయని ఆరోపించారు. తెలంగాణ నుంచి వచ్చే బస్సులను ఆపేశారని తెలిపారు.
కాగా కేంద్ర ఎన్నికల సంఘం...ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్ అధికారులు విస్మయం వ్యక‍్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment