అంబాలా/న్యూఢిల్లీ: మహాభారతంలో దుర్యోధనుడిలో ఉన్న అహంకారం ప్రస్తుతం ప్రధాని మోదీలో కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విమర్శించారు. ప్రధాని మోదీకి దమ్ముంటే గత ఐదేళ్లలో రైతుల సంక్షేమం, మహిళల భద్రత, ఉద్యోగకల్పన విషయంలో తీసుకున్న సంస్కరణలపై ప్రజలను ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ 1 అవినీతిపరుడిగా అంతమయ్యారని ఓ బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఈ మేరకు స్పందించారు. హరియాణాలోని అంబాలాలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక, ప్రధాని మోదీని విమర్శించారు. నిరుద్యోగం, పేదరికం, రైతుల రుణాలు వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. ‘పొగరుబోతుతనం, అహంకారాన్ని భారతదేశం ఏమాత్రం క్షమించదు.
ఇందుకు మహాభారతమే ఉదాహరణ. దుర్యోధనుడికి మోదీలో తరహాలో అహంభావం ఉండేది. వ్యక్తి నాశనమైపోయే సమయం వచ్చినప్పుడు మొట్టమొదట అతని వివేకం నశించిపోతుందని వ్యాఖ్యానించారు. మోదీకి గుణపాఠం తప్పదు.. ‘బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అసలైన సమస్యలపై మాట్లాడరు. తాము ఇచ్చిన హామీల్లో ఏయేవాటిని నెరవేర్చలేకపోయామో చెప్పరు. మోదీజీ.. భారత ప్రజలు చాలా తెలివైనవారు. మీరు వాళ్లను తప్పుదారి పట్టించలేరు. ప్రజలు ప్రతీనేతను జవాబుదారీతనంగా వ్యవహరించేలా చేయగలరు. మోదీని కూడా జవాబుదారీతనంతో ఉండేలా చేస్తారు. ప్రధాని అయిన మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేదంటే ప్రజలంతా మీకు గుణపాఠం చెప్తారు’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment