మంగళవారం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై జరిగిన వ్యూహ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మహమూద్ అలీ, ఈటల, హరీశ్ రావు, పోచారం, మహేందర్‌రెడ్డి, తుమ్మల, నాయిని, రాజీవ్ శర్మ, లక్ష్మారెడ్డి, కేటీఆర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈ నెల 27 నుంచి సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపింది. 26న బీఏసీ సమావేశం నిర్వహించి, ఎన్ని రోజులు సభ జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో వ్యూహ కమిటీ భేటీ అయింది. నెలరోజుల పాటు సమావేశాలు నిర్వహించేలా ప్రతిపాదించాలని.. 15 నుంచి 20 రోజుల పాటు పనిదినాలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసేలా కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున ఈ ప్రతిపాదనను అసెంబ్లీ కార్యదర్శికి పంపించాలని సూచించారు. శాసనసభ ఎన్ని రోజులు జరిగితే.. అన్ని రోజులు మండలి కూడా జరపాలని అన్నారు. శాసనసభలో చర్చ జరిగిన ప్రతి అంశంపైనా మండలిలోనూ చర్చ జరగాలన్నారు.
అన్ని అంశాలపై చర్చ
ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలపై కూలంకషంగా చర్చ జరగాలని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి. సభ్యులు లేవనెత్తే ప్రతి అంశంపై జవాబు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం. ప్రజలకు అన్ని విషయాలను అసెంబ్లీ ద్వారా వివరించాలి. దీనికోసం మంత్రులు సిద్ధం కావాలి. ప్రతిపక్ష సభ్యులు ఏ అంశంపై ఏ ప్రశ్నలు వేసినా ప్రభుత్వం నుంచి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా అమలు చేయని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వాటి గురించి వివరించాలి. సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలి. విలువైన సూచనలు స్వీకరించాలి. అంతిమంగా అసెంబ్లీ నుంచి ప్రజలకు కావాల్సిన సమాచారం పోవాలి. ఎన్ని రోజులు సభ నిర్వహించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
నెల రోజుల పాటు సభ నిర్వహించాలని అధికార పక్షం నుంచి కోరదాం. ప్రతిపక్ష సభ్యులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహించడానికి అభ్యంతరం లేదు. సభ హుందాగా నడవాలి. ప్రతీ అంశంపై చర్చ జరగాలి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక మాతృభాష పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇంటర్ వరకు కచ్చితంగా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలన్న నిబంధనతో మాతృభాష పరిరక్షణ జరగడంతో పాటు అనేక మంది తెలుగు పండిట్లకు ఉద్యోగావకాశం కూడా లభిస్తుందన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించనున్నట్లు వెల్లడించారు.
స్పష్టమైన తీర్మానాలు చేయాలి
ప్రస్తుత సమావేశాలు చాలా ముఖ్యమై నవిగా భావించాలని, ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలని కేసీఆర్ సూచించారు. వివిధ అంశాలపై సభ్యులందరూ మాట్లాడేలా కూలంకషంగా చర్చ జరగాలని, కొన్ని బిల్లు లను ఆమోదించుకోవాలని చెప్పారు. ఇక అసెంబ్లీలో గతంలో అనేక అంశాలపై తీర్మా నాలు చేసి కేంద్రానికి పంపినా.. అక్కడి నుంచి స్పందన రాలేదన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్, హైకోర్టు విభజన, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం చేయడం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన తదితర అంశాలపై కేంద్రాన్ని కోరుతూ మరోసారి అసెంబ్లీ గట్టిగా కోరాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ మేరకు మరోసారి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని, ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. కాగా సమావేశాలకు సంబం ధించి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment