వచ్చే నెలలో అసెంబ్లీ
మొదటి లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్: వచ్చేనెల మొదటి వారం లేదా మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి తుది నిర్ణయం మేరకు ఈ తేదీలు ఖరారవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు బయల్దేరనున్నారు. 14న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. పారిశ్రామిక ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులను వెంట బెట్టుకొని ప్రత్యేక విమానంలో సీఎం చైనా వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఏర్పాట్లు కూడా ప్రారంభించింది.
సీఎం చైనా పర్యటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో అయిదు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని సీఎం ఇటీవల తన మంత్రివర్గ సహచరులతో ప్రస్తావించారు. అయితే చైనా పర్యటన నుంచి వచ్చాక ఈ సమావేశాలు నిర్వహించాలని ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రశ్నలకు సమాధానాలపై సీఎస్ సమీక్ష
గత అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు.. వాటికి అందించాల్సిన రాతపూర్వక సమాధానాలపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల కార్యదర్శులతో వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే సమావేశాల దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న వాటికి సమాచారం అందించాలని సూచించారు. సమావేశాల సమయంలో అధికారులు, సిబ్బంది సెలవులు పెట్టవద్దని, మంత్రులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.