'దేశంలోనే కేసీఆర్ వంటి సీఎం లేరు'
Published Thu, Jan 19 2017 7:36 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ, మండళ్ల శీతాకాల సమావేశాలు జరిగిన తీరు చారిత్రాత్మకమని, అన్ని వర్గాలకు ఊరటనిచ్చేలా సభలు జరిగాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. ఒంటరి మహిళలకు జీవన భృతి కోసం పథకం ప్రకటించడం అభినందనీయమని, బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉభయ సభల వేదికగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, సలీంలు విలేకరులతో మాట్లాడారు.
కుల వృత్తులను కాపాడేందుకు సీఎం ఉభయ సభల్లో చేసిన ప్రకటనలు వెనుకబడిన వర్గాల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చాయని చెప్పారు. మైనారిటీలకు పెద్ద మొత్తంలో పథకాలు ప్రకటించిన కేసీఆర్ వంటి సీఎం దేశంలో మరొకరు లేరన్నారు. కొద్దిగా ఆలస్యమైనా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే పట్టుదలతో సీఎం ఉన్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అసెంబ్లీ జరిగిన తీరుపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, కేసీఆర్ కుటుంబం కనుసన్నల్లో అసెంబ్లీ నడిచిందన్న రేవంత్ ఆరోపణలు అర్థరహితమన్నారు.
Advertisement