కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ
♦ టీఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధం!
♦ మరో ఎమ్మెల్యే గాంధీ కూడా చేరతారని ప్రచారం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కొద్దిరోజులుగా గోపీనాథ్ సైతం అధికార టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన సీఎంను కలవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే గోపీనాథ్, ఆయనతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా టీఆర్‌ఎస్ గూటికి చేరుకుంటారని విశ్వసనీయ సమాచారం.
మిగిలేది ముగ్గురేనా!
పదిహేను మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన టీటీడీపీలో ప్రస్తుతం మిగిలింది కేవలం అయిదుగురు ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, ఆర్.కృష్ణయ్య టీడీపీ శిబిరంలో ఉన్నారు. తాజాగా గోపీనాథ్ సీఎంతో భేటీ కావడంతో టీఆర్‌ఎస్‌లో ఆయన చేరిక కూడా దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. మరో ఎమ్మెల్యే గాంధీ సైతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పార్టీ మారితే ఇక, మిగిలేది ముగ్గురే. సోమవారం ఎన్టీఆర్‌భవన్‌లో జరిగిన మాజీ మంత్రి మాధవరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అయితే గోపీనాథ్, గాంధీ ఇద్దరూ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ టీఆర్‌ఎస్ గూటికి చేరడం ఖాయమైనట్లేనని, అందుకే చంద్రబాబు పాల్గొనే కార్యక్రమానికి కూడా హాజరు కాలేదని చెబుతున్నారు.