పెట్టుబడులతో రండి
⇒ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం కేసీఆర్
⇒ కలసి పనిచేద్దాం.. ప్రగతి సాధిద్దాం
⇒ హైదరాబాద్‌లో కావాల్సినంత
⇒ భూమి ఉంది.. మాది ప్రపంచంలోనే వినూత్న పారిశ్రామిక విధానం
⇒ అడ్డంకులు, ఆటంకాలు లేని అత్యుత్తమ విధానం ఇదొక్కటే
⇒ భారత్ వృద్ధిలో రాష్ట్రాలది కీలక పాత్ర
⇒ ప్రధాని మోదీ సారథ్యంలో ముఖ్యమంత్రులతో టీం ఇండియా
⇒ భారత్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంతో దూసుకెళ్తోందన్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘పెట్టుబడులతో రండి.. కలిసి పనిచేద్దాం.. కలిసి అభివృద్ధి చెందుదాం..’’ అని ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని అన్నారు. తెలంగాణలో.. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరారు. అనువైన వాతావరణంతో పాటు పరిశ్రమలకు కావాల్సినంత భూమి హైదరాబాద్‌లో అందుబాటులో ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు.
సింగిల్ విండో విధానాలు చాలా దేశాల్లో ఉన్నప్పటికీ.. ఆటంకాలు, అడ్డంకుల్లేని అత్యున్నత విధానం ఇదొక్కటేనన్నారు. చైనాలోని డేలియన్ నగరంలో బుధవారం వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన న్యూ ఛాంపియన్స్-2015 సదస్సులో సీఎం పాల్గొన్నారు. ‘ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్‌రోడ్స్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం, ఇంటింటికీ మంచినీరు, అత్యుత్తమ పారిశ్రామిక విధానం, హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఇప్పటి చైనా వేరు..
చైనాను చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. 30 ఏళ్ల కిందటి చైనా వేరు. ఇప్పుడున్న చైనా వేరు. అనూహ్యమైన అభివృద్ధితో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్ కూడా ఇలాగే ముందుకు వెళ్తోంది. అంతర్జాతీయ పరిణామాలు మాకు అనుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉన్నప్పటికీ.. చమురు ధరలు తగ్గడం శుభ పరిణామం. ఈ లాభాన్ని పేదల మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించే వీలుంది.
తద్వారా సమ్మిళిత అభివృద్ధికి అడుగులు వేస్తాం. సంపన్నులు సంపన్నులుగానే, పేదలు పేదలుగానే మిగిలిపోతే లాభం లేదు. అలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా సమతుల్యతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తాం. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలెలా ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థ చౌరస్తాలో దిక్కులు చూసే పరిస్థితిలో లేదు. సంస్కరణలతో శరవేగంగా దూసుకెళ్తోంది.
నీతి ఆయోగ్... టీమ్ ఇండియా!
భారత్ అభివృద్ధిలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, నిధులను పంపిణీ చేసింది. గతంలో ఉన్న ప్రణాళికసంఘం బదులుగా ప్రధా ని సారథ్యంలో ముఖ్యమంత్రుల భాగస్వామ్యం తో ‘నీతి ఆయోగ్’ ఏర్పాటైంది. దీన్ని టీమ్ ఇండియాగా చెప్పుకుంటున్నాం. ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులంతా కలిసికట్టుగా దేశాభివృద్ధితో పాటు రాష్ట్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూ పొందిస్తున్నాం. భారత్‌లో ఫెడరల్ వ్యవస్థ గొప్ప గా పని చేస్తోంది. కొత్తగా.. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది.
నవ రాష్ట్రమైనప్పటికీ అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని తెచ్చాం. గడిచిన 2 నెలల్లోనే 56 కంపెనీలకు అనుమతులు జారీ చేశాం. దాదాపు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాం. ఈ పరిణామాలు భారత్ అనుసరిస్తున్న దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెపుతున్నాయి. అభివృద్ధిలో నూతన శిఖరాలను అధిరోహించాలన్నదే మా ప్రయత్నం. సంస్కరణల దిశగా దృష్టి సారించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఎంతో సమర్థంగా పని చేస్తున్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా గొప్ప విజయం సాధించారు.
రాష్ట్రానికి సహకరించండి
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా నగరాల అభివృద్ధి, సవాళ్లు అనే అంశంపైనా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను విశ్లేషించారు. చైనాలో అభివృద్ధి చెందిన జుయాంగ్‌జో, యువీ నగరాలకు చెందిన మేయర్లు, డిప్యూటీ మేయర్లతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. నగరాల అభివృద్ధిలో తమ అనుభవాలను తెలియజెప్పి.. తెలంగాణకు సహకారం అందించాలని కోరారు.
హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించండి: కేసీఆర్
భవిష్యత్తులో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. హైదరాబాద్ ఆతిథ్యం స్వీకరించాలని ఫోరం ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. బుధవారం సదస్సు ప్రారంభానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎక్స్‌క్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్‌తో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అరగంటకుపైగా చర్చలు జరిపారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితులను సీఎం ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా పేరొందిన హైదరాబాద్‌కు ఉన్న విశిష్టతలను పంచుకున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం సత్ఫలితాలు అందిస్తోందన్నారు. సామాజిక, ఆర్థిక ఆవిష్కరణలతో తెలంగాణ అందరినీ ఆకర్షిస్తోందని ఈ భేటీ అనంతరం స్క్వాబ్ అభిప్రాయపడ్డారు. స్క్వాబ్‌ను కలుసుకోవటం తాను మరిచిపోలేనని, ఆయనతో భేటీ ఎంతో స్ఫూర్తినిచ్చిందని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రితోపాటు మంగోలియా ప్రధాని, చైనా ఐటీ మంత్రి, రష్యా ఉప ప్రధాని.. స్క్వాబ్‌ను కలుసుకున్నారు. ఇదే సందర్భంగా సీఎం.. స్క్వాబ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ హిల్డే స్క్వాబ్‌తో సమావేశమయ్యారు.
1998 నుంచి క్షేత్రస్థాయిలో సేవలందించటంతో పాటు సామాజిక నిబద్ధతతో పని చేసిన వారిని ఈ సంస్థ ప్రత్యేకంగా గుర్తిస్తోంది. ప్రతి ఏడాది భారత్‌లో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా పేరుతో ఒకరిని ఎంపిక చేస్తోంది. సామాజిక రంగంలో ఈ ఫౌండేషన్ చేస్తున్న కృషిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటివరకు ఈ అవార్డులు అందుకున్న వారిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు.