మైసూరు : కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జేడీఎస్ పార్టీయేనన జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. కొన్ని పార్టీలు ప్రైవేటు సంస్థలకు డబ్బులిచ్చి తమకు అనుకూలంగా ఎన్నికల సమీక్షలను చేయించి వాటిని విడుదల చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీల తరహాలో రోడ్‌షోలు, ప్రచారాలు నిర్వహించే శక్తి తమకు లేదన్నారు.
తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలకు పంచడానికి కూడా తమవద్ద డబ్బులు లేవన్నారు. సీఎం సిద్దరామయ్య,ఎంపీ శ్రీరాములు వంటి హేమాహేమీలు బరిలో దిగనున్న బాదామి నియోజకవర్గంలో తమ పార్టీ తరపున ఓ సామాన్య కార్యకర్తను బరిలో దింపామన్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే క్రమంలో ఓటర్లకు పంచడానికి తమ వద్ద డబ్బులు లేవన్నారు.హై–క, ముంబయి–కర్ణాటక ప్రాంతాల్లో జేడీఎస్‌కు ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందన్నారు.
స్వతంత్ర అభ్యర్థులతో టచ్‌లో ఉన్నాం
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పది నుంచి 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, వారిని జేడీఎస్‌లో ఆహ్వానించడానికి ఇప్పటికే ఆయా అభ్యర్థులతో మంతనాలు కూడా జరిపామన్నారు. సోమవారం తాము విడుదల చేసిన మేనిఫెస్టో పేదలు, మహిళలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించామన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే సోమవారం విడుదల చేసిన మేనిఫెస్టోను యథాతథంగా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అభ్యర్థుల తరపున ప్రచారాలు నిర్వహించే శక్తి తమకు లేదని అందుకే సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున బరిలో దిగనున్న జీటీ.దేవేగౌడ తరపున కూడా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం లేదన్నారు. వరుణ,కే.ఆర్ నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment