
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరో దిగజారుడు వ్యాఖ్య వినిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ఆజం ఖాన్, తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో పదేళ్లపాటు రాంపూర్‌కు జయప్రద ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించగా, ఇటీవలే ఆమె బీజేపీలో చేరి ప్రస్తుతం ఆమె అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. దీనిపై ఆజం ఖాన్ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అని ఖాన్ ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌తో జయ ప్రద సంబంధాలపై చర్చ లేవనెత్తేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ వ్యాఖ్యలు అపకీర్తికరమైనవనీ, ఆయనకు అతి త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కూడా తాము కోరతామన్నారు.