సాక్షి, లక్నో : ప్రముఖ కట్టడాల జాబితాల నుంచి తాజ్ మహల్ తొలగింపు మాటేమోగానీ తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవక ముందే మరో నేత దానిని కొనసాగింపు వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక్క తాజ్ మహలే కాదు.. పార్లమెంట్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ వాటిని కూడా వారసత్వ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. వివాదాల పుట్ట అజాం ఖాన్.
సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి అయిన అజాం ఖాన్ మంగళవారం ఓ మీడియాతో మాట్లాడుతూ... మొగలుల కాలంలో నిర్మితమైన కట్టడాలపై నిషేధం విధించాలని ఎప్పటి నుంచో తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. తాజ్ మహల్ ఒక్కటే కాదు.. జాతి సంపదలుగా చెప్పుకుంటున్న రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, ఎర్రకోట, కుతుబ్ మినార్ ఇవన్నీ బానిసత్వానికి ప్రతీకలే. అలాంటప్పుడు వాళ్లు(యూపీ ప్రభుత్వం) వాటిని కూడా ప్రముఖ కట్టడాల జాబితా నుంచి తొలగించి కూల్చేయాల్సిందే అని అజాం ఖాన్ అంటున్నారు.
ముఖ్యమంత్రిగా ఆదిత్యానాథ్ ఆరు నెలల పాలన పూర్తి అయిన సందర్భంలో యూపీ ప్రభుత్వం ఓ బుక్‌లెట్ విడుదల చేయగా.. అందులో పర్యాటక ప్రాంత జాబితా నుంచి తాజ్ మహల్‌ను తొలగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపించగా... ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు మంట పెట్టాయి. వారసలు ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు? తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ తన తండ్రిని చెరసాలలో వేశారు. మొత్తం హిందువులే లేకుండా చేయాలని కుట్ర చేశారు. ఇలాంటి వాళ్లు మన చరిత్ర భాగస్వాములవడం చాలా విచారకరం. చరిత్ర మార్చాల్సిన అవసరం ఉంది' అని సంగీత్ సోమ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment