
మీడియాపై ఆజం ఖాన్ చిందులు
లక్నో : జయప్రదపై ‘ఖాకీ నిక్కర్’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత ఆజం ఖాన్ సోమవారం మీడియా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. మధ్యప్రదేశ్‌లోని విదిశలో రాజ్యసభ ఎంపీ మునావర్ సలీం అంత్యక్రియలకు హాజరై తిరిగివస్తున్న ఆజం ఖాన్‌ను జయప్రదపై ఆయన చేసిన వ్యాఖ్యల గురించి వివరణ అడగ్గా విలేకరులపై అసహనం వ్యక్తం చేశారు. మీ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చానంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి చిర్రుబుర్రులాడారు. కాగా జయప్రదపై ఆజం ఖాన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కాగా, ఓ ఎన్నికల ప్రచార సభలో ఆదివారం ఆజం ఖాన్ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.