అలీగఢ్/కథువా: అంబేడ్కర్ అందించిన రాజ్యాంగానికి ఉన్న శక్తి కారణంగానే ఓ చాయ్‌వాలా(టీ అమ్మే వ్యక్తి) భారతదేశపు ప్రధానమంత్రి అయ్యాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాకుండా సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అయ్యారని వ్యాఖ్యానించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ సహించలేకపోయిందని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన మోదీ, విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
‘పంచతీర్థాల’ ఏర్పాటు..
అంబేడ్కర్ 128వ జయంతి నేపథ్యంలో ఆదివారం యూపీలోని అలీగఢ్‌లో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘బాబా సాహిబ్ అందించిన రాజ్యాంగం కారణంగానే వెనుకబడ్డ, అణచివేతకు గురైన సామాజికవర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారు. ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. మీ అందరి మద్దతుతో అంబేడ్కర్ చూపిన బాటలో ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ నినాదంతో ఈ చౌకీదార్(కాపలాదారు) ముందుకెళుతున్నాడు. కేవలం అంబేడ్కర్ మార్గాన్ని అనుసరించడమే కాదు.. చరిత్రలో ఆయనకు స్థానమిచ్చి గౌరవించేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా అంబేడ్కర్‌కు అనుబంధమున్న ఐదు ప్రాంతాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తాం’ అని ప్రకటించారు.
అంబేడ్కర్‌ను కాంగ్రెస్ సహించలేకపోయింది
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల పొత్తుపై స్పందిస్తూ..‘కనీసం 40 స్థానాల్లో కూడా పోటీచేయలేని వారు ప్రధాని అయిపోవాలని కలలు కంటున్నారు. ప్రజలు ఎస్పీ, బీఎస్పీల కుల రాజకీయాలను తిరస్కరించారు. ఎన్నికల ఫలితాల తో ఈ రెండు పార్టీలు తాళాలు కొనుక్కోవాల్సిందే’ అని మోదీ వ్యాఖ్యానించారు. అలీగఢ్ తాళాల తయారీకి ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయనో గొప్ప ఆర్థికవేత్త, విధాన రూపకర్త, రచయిత, న్యాయశాస్త్ర కోవిదుడు. సామాజంలో వివక్ష తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అంబేడ్కర్ అసాధారణ ప్రతిభ కనబర్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను సహించలేకపోయింది. అంబేడ్కర్ చెప్పినట్లు సమాజాన్ని మారుస్తామన్న కొందరు నేతలు ‘ముందుగా నా కుటుంబం.. ఆ తర్వాత నా బంధువులు’ నినాదాన్ని ఎత్తుకున్నారు’ అని అన్నారు.
ఆ కుటుంబాలను అడ్డుకుంటాం: ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలు జమ్మూకశ్మీర్‌లో మూడు తరాల పాటు ప్రజల జీవితాలను నాశనం చేశాయని ప్రధాని ఆరోపించారు. భారత్‌ను విడగొట్టేందుకు ఈ రెండు కుటుంబాలను అనుమతించబోమన్నారు. కథువాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ..‘అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు రాష్ట్రాన్ని మూడు తరాల పాటు నాశనం చేశాయి. వీరిని ఓడిస్తేనే జమ్మూకశ్మీర్‌కు ఉజ్వలౖ భవిష్యత్ సాధ్యం. తొలిదశ పోలింగ్‌లో రాష్ట్ర ప్రజలు భారీగా ఓటేయడంతో ఉగ్రనేతలు, అవకాశవాదులు, మహాకల్తీ కూటమి సభ్యులు నిరాశకు లోనయ్యారు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేస్తామంటూ బలగాల నైతికస్థైర్యాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఒక్క విషయం నేను స్పష్టం చేయదలచుకున్నా. కశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే’ అని స్పష్టం చేశారు. జలియన్ వాలాబాగ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య హాజరైన స్మారక కార్యక్రమానికి వెళ్లొద్దని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌పై వచ్చిన ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలనని మోదీ వ్యాఖ్యానించారు. జాతీయవాదం కాంగ్రెస్ పార్టీకి అవమానకరంగా అనిపిస్తోందని దుయ్యబట్టారు. కశ్మీరీ పండిట్లు ఇళ్లు విడిచి పారిపోవడానికి కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు.
అంబేడ్కర్ రాజ్యాంగం చలవే
Published Mon, Apr 15 2019 3:25 AM | Last Updated on Tue, Jun 4 2019 6:28 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment