
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు హామీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్లాంట్ ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలపై కేంద్రానికి ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదని, ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తనకు చెప్పారన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రం అడిగిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్‌లో రూ.600 కోట్లతో నిర్మాణంలో ఉన్న కొత్త ఆయిల్ టెర్మినల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అలాగే రూ.2,321 కోట్లతో నిర్మాణంలో ఉన్న పారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్‌ను కొత్త ఆయిల్ టెర్మినల్‌కు అనుసంధానంగా ఉపయోగించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలసి కోరినట్టు దత్తాత్రేయ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment