సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు లేకపోతే నిధుల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని అన్నారు. ఇష్టానుసారంగా ప్రాజెక్టు వ్యయాలను పెంచుతున్నారని, రూ.42 వేల కోట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచేశారని, అలాగే 2014లో రూ.39 వేల కోట్లు ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచేశారని అన్నారు. తద్వారా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతోందన్నారు.
అసలు తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసి విచారణ జరపాలని కోరనున్నట్లు తెలిపారు. ఇక కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ అనేది గోడ మీద పిల్లిలాంటిదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ గానీ, చంద్రబాబు చెప్పే మహాకూటమి గానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, అవినీతిపరులతో చేతులు కలిపిన బాబు.. మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపరులపై మోదీ ఉక్కుపాదం మోపడంతో చంద్రబాబు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇక తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 6 స్థానాల్లో బీజేపీ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment