బాపట్ల నియోజకవర్గ ముఖచిత్రం
సాక్షి, బాపట్ల : బాపట్లగా పిలువబడే భావపురి కోన ప్రభాకరరావు వంటి ఉద్దండులను అందించింది. కళా సాంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేసే ఈ ప్రాంతం.. ధాన్యపు సిరులు కురిపిస్తుంది. ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సూర్యలంక తీరం.. పర్యాటకులను ఆనంద తరంగంలో ముంచెత్తుతుంది. అగ్రికల్చర్ వంటి కళాశాలలతో విద్యా కేంద్రంగా భాసిల్లుతోంది. మత్స్య సందప ఎగుమతితో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఎప్పటికప్పుడు రాజకీయ చైతన్యం చూపించే నియోజకవర్గ ప్రజలు నాలుగు సార్లు కోన కుటుంబానికి పట్టం కట్టారు.
రాజకీయ చైతన్యం కలిగిన బాపట్ల స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనూ దేశ భక్తిని చాటింది. 1936లో ఆంధ్రప్రదేశ్ అవతరణలో తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశం బాపట్లలోనే జరిగింది. 1950మే 5న బాపట్ల పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అవతరించింది. కమ్యూనిస్టు ఉద్యమాలకు 1950 నుంచి కంచుకోటగా భాసిల్లిన బాపట్ల నియోజకవర్గానికి 1955లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది.
1967 తరువాత కాంగ్రెస్ పార్టీ వశమైంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు పార్టీకి చెందిన వేములపల్లి శ్రీకృష్ణ ఎన్నికయ్యారు. 1967లో నియోజకర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 1983లో తెలుగుదేశం పార్టీ గెలుపొందగా, 1989లో కాంగ్రెస్‌పార్టీ మళ్లీ పాగా వేసింది. 1994,1999లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
చరిత్ర కలిగిన బాపట్లలో కోన కుటుంబం నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా చరిత్ర సృష్టించారు. ఇక్కడ కోన కుటుంబానిదే అరుదైన రికార్డు. ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా బాపట్ల నుంచి గెలుపొందారు.1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి వసరుగా 14సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తం 175 రెవెన్యూ గ్రామాలు ఉండగా బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలతోపాటు బాపట్ల మున్సిపాల్టీ ఉన్నాయి.
రాజకీయ పాఠశాలను ప్రారంభించిన బాపూజీ
బాపట్ల పట్టణంలోని టౌన్‌హాలులో జరిగిన సమావేశానికి 1923లో హాజరైన బాపూజీ మంతెనవారిపాలెంలో రాజకీయ పాఠశాలను ప్రారంభించారు.1950లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ బాపట్లను సందర్శించి రైల్వే స్టేషన్ సమీపంలో కూడలి ప్రదేశంలో ప్రసంగించారు. 1985లో వాజ్‌పేయి కర్లపాలెంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు దీనదయాళ్ అదే సంవత్సరం ఎన్జీవోహోమ్‌లో జరిగిన సభకు హాజరయ్యారు.
సూర్యలంక తీరం.. పర్యాటక కేంద్రం
బాపట్ల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది సూర్యలంక తీరం. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ తీరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. బాపట్ల పాడి పంటలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం నుంచి ధాన్యం రాష్ట్ర నలుమూలలకు ఎగుమతి అవుతుంది. బాపట్లలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి. ఇలా విద్యా కేంద్రంగా భాసిల్లుతోంది. ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుపల్లి జనార్దన్ రెడ్డి కూడా బాపట్ల ఎంపీగా గెలుపొందారు. పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా పని చేశారు. ఇక్కడ పంటలుగా వరి ఎక్కువగా పండుతుంది. వేరుశనగ, ఆక్వా సాగు, చేపల పెంపకం, మొక్కజొన్న సాగు అధికంగా ఉంటుంది. సూర్యలంక తీరం ఉండడంతో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది.
ఎన్నికల్లో విజయాలు
1962లో కొమ్మినేని వెంకటేశ్వరరావు ప్రత్యర్థి మంతెన సత్యవతిపై 1,213 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
1967లో మూడో సారి కూడా కోన ప్రభాకరరావు కేవీ రావుపై 15,227 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
1972లో కోన ప్రభాకరరావు ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుపై 2,289 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
1978లో కోన ప్రభాకరరావు ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుపై 189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
1983లో సీవీ రామరాజు ప్రత్యర్థి కోన ప్రభాకరరావుపై 29,432 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
1985లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రత్యర్థి మంతెన వెంకట సూర్యనారాయణపై 18,027 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
1989లో చీరాల గోవర్దన్‌రెడ్డి ప్రత్యర్థి అచ్యుతరామారావుపై 15,583 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
1994లో ముప్పలనేని శేషగిరిరావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి కత్తి పద్మారావుపై 41494 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
1999లో అనంతవర్మరాజు ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుపై 13,845 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
2004లో గాదె వెంకటరెడ్డి ప్రత్యర్థి అనంతవర్మరాజుపై 15,569 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
2009లో గాదె వెంకటరెడ్డి ప్రత్యర్థి చీరాల గోవర్దన్‌రెడ్డిపై 1,363 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
2014సంవత్సరంలో కోన రఘుపతి ప్రత్యర్థిపై 5,813 ఓట్లతో ఆధిక్యంతో గెలుపొందారు.
బాపట్ల నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు ఇలా
మండలం | పురుషులు | స్త్రీలు | ఇతరులు | మొత్తం |
బాపట్ల | 27,093 | 27,850 | 1 | 54,943 |
బాపట్ల టౌన్ | 24,704 | 26,465 | 2 | 51,171 |
కర్లపాలెం | 19,218 | 19,405 | 1 | 38,624 |
పిట్టలవానిపాలెం | 14,321 | 14,919 | 2 | 29,242 |
మొత్తం | 85,336 | 88,639 | 6 | 1,73,981 |
Comments
Please login to add a commentAdd a comment