మూన్‌మూన్ సేన్, బిశ్వరూప్ మండల్ , బాబుల్ సుప్రియో
పశ్చిమ బెంగాల్‌లోని 42లోక్‌సభ స్థానాల్లో కీలకమైన అసన్‌సోల్ నియోజకవర్గంలో గెలుపును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇక్కడ రెండో సారి గెలిచి పట్టు బిగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, ఎలాగైనా ఇక్కడ బోణీ కొట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది.బొగ్గు గనులు, ఫ్యాక్టరీల కార్మికులు, స్క్రాప్ డీలర్లతో పాటు కోల్ మాఫియా కూడా ఈ నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించే శక్తులు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన(కోల్‌కతా తర్వాత) అసన్‌సోల్‌లో 75 శాతం హిందువులు,21శాతం ముస్లింలు ఉన్నారు. జనాభాలో 50శాతం హిందీ మాట్లాడతారు. బిహార్, జార్ఖండ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువగా ఉన్నారు.
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం కమ్యూనిస్టులకు ఆయువు పట్టుగా ఉండేది.1957 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ సీపీఎం 10 సార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, బీజేపీ ఒక సారి నెగ్గాయి.1989 నుంచి 2009 వరకు ఈ నియోజకవర్గం సీపీఎంకే దక్కుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో మొదటి సారి బీజేపీ జయకేతనం ఎగుర వేసింది.ఏప్రిల్29 పోలింగ్ జరిగే ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో, తృణమూల్ నుంచి సినీనటి మూన్‌మూన్‌సేన్, సీపీఎం తరఫున గౌరంగా చటర్జీ, కాంగ్రెస్ టికెట్‌పై బిశ్వరూప్ మండల్ పోటీ చేస్తున్నారు.అయితే, బీజేపీ, తృణ మూల్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది.
తృణమూల్ జెండా ఎగురుతుందా
రాష్ట్రంలో కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ ఈ ఎన్నికను సవాలుగా తీసుకుంది. రాష్ట్రంలో ఇంత వరకు తృణమూల్ జెండా ఎగరని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ అసన్‌సోల్ ఒకటి.ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు తృణమూల్ చేతిలో ఉన్నాయి. 2014లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి డోలా సేన్ కేవలం 70వేల ఓట్ల తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోయారు.
అందుకే ఈ సారి ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో డోలా సేన్‌ను పక్కన పెట్టి మూన్‌మూన్ సేన్‌ను బరిలో దింపింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తృణమూల్ హవా నడిచినా బీజేపీ గెలుచుకున్న రెండు సీట్లలో అసన్‌సోల్ ఒకటి. ఈ సారి కూడా ఇక్కడ నెగ్గి మమతా బెనర్జీకి మోదీ దెబ్బ రుచి చూపించాలని కమలనాధులు ఆశిస్తున్నారు.హిందూ మెజారిటీ ఓటర్లు ఉండటం.సీపీఎంలో తటస్తుల ఓట్లు తమకు వస్తాయన్న ఆశ బీజేపీకి గెలుపుపై నమ్మకం కలిగిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి 37శాతం, సీపీఎంకు 22 శాతం ఓట్లు వచ్చాయి.
ఈ సారి సీపీఎం ఓట్లు సగం వచ్చినా గెలుపు తమదేనని బీజేపీ భావిస్తోంది. సిట్టింగ్ ఎంపీ సుప్రియోకు నియోజకవర్గం ప్రజలతో మంచి సంబంధాలే ఉన్నా యి. జనంలో కలిసిపోయి ఆయన చేసే ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది.అయితే,2018లో నియోజకవర్గంలో జరిగిన మత కలహాలు కషాయం పరపతిని తగ్గించాయి. ఆ గొడవల్లో ఓటర్లు హిందూ–ముస్లింలుగా విడిపోయారు. కలహాల తదనంతరం ఆరెస్సెస్, వీహెచ్‌పీ వంటి బీజేపీ అనుబంధ సంస్థల కార్యకలాపాలు ముమ్మరం కావడంతో ముస్లింలు భద్రత కోసం తృణమూల్ వైపు మళ్లారు.
ఈసారి తృణమూల్‌కే ఓటేస్తా మని ముస్లిం పెద్దలు కూడా చెబుతున్నారు. అదీగాక నిరుద్యోగ సమస్య పరిష్కారంలో, మూతపడ్డ పరిశ్రమలను తెరిపించడంలో, ముఖ్యంగా హిందూస్తాన్ కేబుల్స్‌ను తిరిగి తెరిపించడంలో సుప్రియో విఫలమయ్యారన్న ఆగ్రహం ఓటర్లలో బాగా ఉంది. నియోజకవర్గంలో రెండు పార్టీలూ కూడా గెలుపుపై నమ్మ కం పెట్టుకునే పరిస్థితులులేవని ఎన్నికల పరిశీలకుల భావన.
Comments
Please login to add a commentAdd a comment