మీరే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు | Beeda Masthan Rao Slams Alekhya Couples And Counselors | Sakshi
Sakshi News home page

మీరే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు

Published Thu, Sep 6 2018 3:22 PM | Last Updated on Thu, Sep 6 2018 3:22 PM

Beeda Masthan Rao Slams Alekhya Couples And Counselors - Sakshi

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కావలి: కావలిలో టీడీపీని మీ అవినీతి పనులతో భ్రష్టు పట్టించారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అలేఖ్య, ఆమె భర్త శ్రీకాంత్‌లపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి బీద మస్తాన్‌రావు మండిపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవినీతి సొమ్ము వాటాల పంపకంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో బీద మస్తాన్‌రావు బుధవారం అలేఖ్య దంపతులను తన ఇంటికి పిలిపించుకుని వారు చేసిన అవినీతి చిట్టాను చదివి వినిపించారని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సేకరించిన సమాచారం మేరకు.. పార్టీని బతికిస్తారని మీకు అవకాశం కల్పిస్తే ప్రతి పనిలో అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ పార్టీని భ్రష్టు పట్టించారని బీద తీవ్ర స్వరంతో మండి పడడంతో అలేఖ్య జోక్యం చేసుకుంటూ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమరా యాదగిరి వల్లనే ఈ రాద్ధాంతం అంతా జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. దీంతో బీద అన్నీ నాకు తెలుసంటూ మండిపడినట్లు సమాచారం.

మున్సిపాలిటీలో ఏ ఏ విభాగాల నుంచి అందుకున్న నజరానాలు, మంత్రి నారాయణ కావలి పర్యటనకు వచ్చినప్పుడు అయిన ఖర్చును తాను పెట్టానని, ఆ బిల్లులు మున్సిపాలిటీనే ఏదో ఒక రకంగా సర్దుబాటు చేయాలని అలేఖ్య అధికారులపై వత్తిడి తీసుకువచ్చిన విషయాలను బీద సవివరంగా వారికి చెప్పడంతో అలేఖ్య దంపతులు కంగుతిన్నారు. మీ వల్ల పట్టణంలో పార్టీ భ్రష్టుపట్టి పోయిందని, ఇంతకన్నా ఇంకేమి చేయగలరని బీద మస్తాన్‌రావు నిష్ఠూరమాడారు. ఆమె భర్త శ్రీకాంత్‌ను మాత్రం నీ వసూళ్ల ఆగడాలు వల్ల పట్టణంలో పార్టీ అధః పాతాళానికి వెళ్లి పోయిందన్నారు. ఇది ఇలా ఉండగా పార్టీకి చెందిన కౌన్సిలర్లు వడ్లమూడి వెంకటేశ్వర్లు, ఉప్పు వెంకటస్వామిలను మంగళవారం పార్టీ కార్యాలయానికి పిలిపించి మీ ఇద్దరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని బీద మస్తాన్‌రావు అగ్గిలంమీద గుగ్గిలమైనట్లు సమాచారం. కావలిలో పార్టీని ఏమి చేయదలుచుకున్నారని అలేఖ్య దంపతులు, కౌన్సిర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై పార్టీ శ్రేణులు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అంటూ చర్చించుకోవడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement