వారసులొచ్చారు.. The Big Fat Political Families Of YSRCP In Guntur District | Sakshi
Sakshi News home page

వారసులొచ్చారు..

Published Fri, May 31 2019 3:09 PM

The Big Fat Political Families Of YSRCP In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ వారసులు విజయదుందుభి మోగించారు. తమ వారసత్వ రాజకీయాలను కొనసాగించారు. ప్రజా సేవలో రాణిస్తున్నారు. నరసరావుపేట ఎంపీ, గురజాల, మాచర్ల, బాపట్ల, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారి తాతలు, తండ్రులు, మామల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించడం విశేషం. అయితే జిల్లాలో గెలిచిన రాజకీయ వారసులంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ  నుంచి గెలుపొందడం మరో విశేషం. 

ఎంపీగా భారీ మెజార్టీ
జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 1.53 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత అయిన లావు రత్తయ్య కావడం అందరికి తెలిసిన విషయమే. అయితే లావు రత్తయ్య వేర్వేరు పార్టీల తరఫున రెండు సార్లు ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయ వారసునిగా శ్రీకృష్ణదేవరాయలు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన మొదటిసారే ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. 





వరుసగా నాలుగో సారి..
మాచర్ల ఎమ్మెల్యేగా వరుసగా నాల్గో సారి విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించారు. గతంలో అక్కడ ఎవరైనా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలు పక్కన పడేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం వరుసగా నాల్గో సారి ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన బాబాయి పిన్నెల్లి సుందరరామిరెడ్డి  పల్నాడులో మంచి పేరు సంపాదించినప్పటికీ 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో మరో బాబాయి పిన్నెల్లి లక్ష్మారెడ్డి సైతం  పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన రామకృష్ణారెడ్డి అప్పటి నుంచి 2009, 2012, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు.

అన్నాబత్తుని వారసుడు..
తెనాలి నుంచి పోటీ చేసి గెలుపొందిన అన్నాబత్తుని శివకుమార్‌ తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ 1983, 1985 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన అన్నాబత్తుని శివకుమార్‌ 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 






మామ స్ఫూర్తితో..
పొన్నూరు నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి వెంకట రోశయ్య ఐదు సార్లు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడు కిలారి వెంకట రోశయ్య. 2009 ఎన్నికల్లో తెనాలి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మాత్రం అనూహ్యంగా పొన్నూరు నుంచి పోటీ చేసి సంచలన విజయం సాధించారు. 

కోన కుటుంబం నుంచి..
బాపట్ల ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొందిన కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఆయన తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 






మూడో తరం నేత మహేష్‌రెడ్డి
రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ రాజకీయ కుటుంబంగా పేరొందినది కాసు కుటుంబం. మూడో తరానికి చెందిన కాసు మహేష్‌రెడ్డి ఎమ్మెల్యేగా గురజాల నుంచి పోటీ చేసి గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. మహేష్‌రెడ్డి తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా, గవర్నర్‌గా పనిచేశారు. మరో తాత కాసు వెంగళరెడ్డి రాజ్యసభ్య సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, జిల్లాపరిషత్‌ చైర్మన్‌గా అనేక ఉన్నత పదవులు పొందారు. కాసు మహేష్‌రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మహేష్‌రెడ్డి మొదటిసారిగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా గురజాల నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది కాసు కుటుంబంలో మూడో తరం రాజకీయ నేతగా పేరొందారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement