సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టు ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అతివిశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదన్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశ రాజకీయాలపై దృష్టి పెడతానని చెప్పారు. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ కూటములకు భిన్నంగా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందన్నారు. ప్రత్యేక పంథాలో దేశంలోని ప్రజలందరినీ ఏకం చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ వంకర పార్టీలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీలతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్‌ఎస్‌ఎస్, ఆర్‌ఎస్‌యూ, రాడికల్ స్టూడెంట్స్‌తో పాటు దేశంలోని 42 పార్టీల మద్దతు తీసుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ సాకారమైందని, ఇక జాతీయ రాజకీయాల్లోకి అడగుపెడతానని ప్రకటించారు.
చెత్త నాయకుడు చంద్రబాబు
చిన్న మోదీ అంటూ తనపై ఆరోపణలు చేసిన చంద్రబాబును మురికి రాజకీయ నాయకుడు (డర్టీ పొలిటికల్ లీడర్)గా కేసీఆర్ వర్ణించారు. చంద్రబాబు నాయకుడు కాదని, మీడియా మేనేజర్ అని పేర్కొన్నారు. కొంత కాలం బీజేపీతో స్నేహం చేసి వదిలేశారని, గతంలో తిట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు చేతులు కలిపారని అన్నారు. దీనిపై ప్రజలకు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ, మోదీ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. తమ కంటే కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉందని వివరించారు. ఎన్నికల తర్వాత ఈ విషయం రుజువవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటా
తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలతో జాతీయ రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తారని ప్రశ్నించగా.. జయప్రకాశ్ నారాయణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారని, మలిదశ తెలంగాణ ఉద్యమం తన ఒక్కడితోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. మమతా, నవీన్ పట్నాయక్ లాంటి నాయకులు కాంగ్రెస్ లేదా బీజేపీ కూటమితో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రజలు బలంగా కోరుకుంటే వారంతా తమ వెంటే వస్తారని దీమాగా చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ రాజకీయ కూటమి కాదని, ప్రజల కూటమని పేర్కొన్నారు. ఫెడరల్ ప్రంట్ ప్రధాని అభ్యర్థి ఎవరని అడగ్గా సరైన సమయంలో ప్రకటిస్తామన్నారు. చంద్రబాబును ఓడించడానికి ఏపీ రాజకీయాల్లోనూ కలగజేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం తప్పుడు నిర్ణయమన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబు నమ్మరని చెప్పారు. మహాకూటమిలో కోదండరాం చేరడం సరైన నిర్ణయం కాదన్నారు.
మళ్లీ అధికారం మాదే
తమ ప్రభుత్వంపై ఎటువంటి ప్రజావ్యతిరేకత లేదని, తెలంగాణలో తాము తిరిగి అధికారంలోకి వస్తామని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీకి 95 నుంచి 107 సీట్లు వస్తాయని అంచనా వేశారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేశామని ఆయన చెప్పుకొచ్చారు. తమ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment