యోగిపై సొంత మంత్రి సంచలన వ్యాఖ్యలు | BJP Failed in Coalition Dharma | Sakshi
Sakshi News home page

యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published Mon, Mar 19 2018 2:58 PM | Last Updated on Mon, Aug 27 2018 3:32 PM

BJP Failed in Coalition Dharma - Sakshi

లక్నో: తాజా ఉపఎన్నికల ఫలితాల నుంచి కోలుకోకముందే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మరో షాక్‌ తగిలింది. తన మంత్రివర్గంలోని సొంత మంత్రిపై ఆయన పాలనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ సంకీర్ణ ధర్మం పాటించడం లేదు. ఎల్లప్పుడూ వారికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం గురించి గొప్పలు చెప్పుకోవడం మాత్రమే తెలుసు. ప్రజాసంక్షేమం కన్నా గుళ్లూ గోపురాలపైనే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కువ. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పటికీ అవినీతి ఏమాత్రం తగ్గలేదు’ అంటూ బీసీ సంక్షేమ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ బాంబు పేల్చారు. సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత అయిన రాజ్‌భర్‌ బీజేపీ మిత్రపక్షం కావడంతో యోగి మంత్రివర్గంలో చేరారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఏడాది పాలన పూర్తిచేసుకుంటున్న యోగి సర్కారును ఇరకాటంలో పడేశాయి.

భాగస్వామ్య పార్టీలంటే లెక్కలేదు..
రాజ్‌భర్‌ ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ...‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మేమే కారణం. అయినప్పటికీ మమ్మల్ని వారు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చాం. కానీ వారి వైఖరిలో మార్పు రాలేదని’ ఆరోపించారు. ‘మార్చి 23న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా మమ్మల్ని ఇంతవరకూ సంప్రదించలేదు. మా ఓటు కావాలా అని మేమే వెళ్లి వారిని అడగాలేమో’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

విజయావకాశాలే ఎక్కువ..
మిత్రపక్షాలతో కలిసి బీజేపీకి ఉన్న అసెంబ్లీ సీట్లు 324. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ గణాంకాల ప్రకారం పది సీట్లలో ఎనిమిదింటిలో సులభంగానే విజయం సాధించవచ్చు. తొమ్మిదో అభ్యర్థి కోసం ఇంకా 28 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు కూడా.

బీజేపీ అభ్యర్థులు వీరే..
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థిత్వాన్నిఅధికార పార్టీ ఖరారు చేసింది. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, అశోక్‌ బాజ్‌పాయ్‌, విజయ్‌పాల్‌ సింగ్‌ తోమర్‌, సకాల్‌ దీప్‌ రాజ్‌భర్‌, కంటా కర్దం, అనిల్‌ జైన్‌, హరనాథ్‌ సింగ్‌ యాదవ్‌, జీవీఎల్‌ నరసింహారావు, అనిల్‌ కుమార్‌ అగర్వాల్‌ తదితరులు బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిగా జయా బచ్చన్‌ను ఖరారు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement