
కోల్‌కతా : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు కుల, మతాల ప్రతిపాదికన ఓటర్లకు దగ్గరయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దానిలో భాగంగానే ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డ బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించింది. బెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 850కి పైగా మైనారిటీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. బీజేపీ చరిత్రలోనే ఇంత మొత్తంలో ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి.
రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం ఉన్న ముస్లిం జనాభాకు దగ్గరయేందుకు బీజేపీ మైనారిటీ అభ్యర్ధులకు టిక్కెట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. బీజేపీ మైనారిటీలకు టిక్కెట్లు కేటాయించడాన్ని అధికార తృణమూల్ కొట్టిపారేసింది. రాష్ట్రంలోని మైనారిటీలకు సీఎం మమత బెనర్జీపై విస్వాసం ఉందని, వారంతా టీఎంసీతోనే ఉంటారని తృణమూల్ సీనియర్ నేత పార్థ ఛటర్జీ తెలిపారు.
2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 100 కంటే తక్కువ సీట్లను మైనారిటీలకు కేటాయించగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లలో కేవలం ఆరుగురు ముస్లిం అభ్యర్ధులకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. ముస్లింలు అధికార తృణమూల్‌పై వ్యతిరేకతతో ఉన్నారని, బీజేపీపై వారికి పూర్తి విశ్వాసం ఉందని రాష్ట్ర ముస్లిం మోర్చా అధ్యక్షుడు అలీ హుస్సేన్ తెలిపారు.
‘కేంద్రంలో, 20 రాష్ల్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ పాలనలో ముస్లింలు సంతోషంగా ఉన్నారు. 2019లో కూడా మా పార్టీయే అధికారంలోకి వస్తుంది. మా పార్టీ కులం, మత ప్రాతిపాదికన సీట్లు కేటాయించదు. అభ్యర్థుల విజయావకాశాలకు బట్టి టిక్కెట్లు ఇస్తుంది.’ అని దిలీప్ ఘోష్ అన్నారు. ఇటీవల తృణమూల్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ముకుల్ రాయ్ మైనారిటీలకు టిక్కెట్లు కేటాయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. కాగా మే 14న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.