
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజల ఓపిక నశిస్తోందని, ప్రజలు తిరగబడితే ఎన్నికలు ఎప్పుడైనా జరుగవచ్చని, ముందస్తు రావచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. తాము మాత్రం ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉండాలనే అనుకుంటున్నామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వతీరుతో ప్రజలు విసిగిపోయారని, బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోదని, అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటామన్నారు. అక్కడి టీఆర్‌ఎస్ నాయకత్వంపై కేసీఆర్‌కు నమ్మకంలేకనే మంత్రులను, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ భయంతోనే కేబినెట్ విస్తరణ..
హుజుర్‌నగర్‌లో తమకు 12 వేల సభ్యత్వం ఉంద ని లక్ష్మణ్ అన్నారు. హుజుర్‌నగర్ టికెట్ కోసం రామకృష్ణ, జైపాల్‌రెడ్డి, రవీంద్రనాయక్, రాంమోహన్ రెడ్డి, శ్రీకళారెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. శంకరమ్మ తమను కలవలేదని, ఆమె టీఆర్‌ఎస్‌లో ఉందని పేర్కొన్నారు. ఆమె బయటకు వచ్చి తమను కలిస్తే తప్పకుండా ఆశ్రయం కల్పిస్తామన్నారు. హుజూర్‌నగర్‌లో కేసీఆర్ డబ్బుతో గెలువాలని చూస్తున్నారని, కానీ అక్కడి ప్రజలు దేశభక్తి కలిగిన వారని, బీజేపీని ఆదరిస్తారన్నారు. బీజేపీ భయంతోనే సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేపట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మీడియా కన్వీనర్ సుధాకరశర్మ, అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.