
సాక్షి, విశాఖపట్నం : మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి అవినీతి చక్రవర్తి రాష్ట్రంలో మరొకరు ఉండరని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక్క హుదూద్ ఇళ్ల స్కాంలోనే సుమారు ఏడున్నర కోట్ల అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. మంగళవారం ఎన్నికల ప్రచారం భాగంగా పలు ప్రాంతాలు పర్యటించిన విష్ణుకుమార్ రాజు.. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాస్‌పై విరుచుకపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ నియోజకవర్గంలోనూ అక్రమాలు, దోపిడీలు చేయడం గంటాకు అలవాటని విమర్శించారు. దీంతో భీమిలి ప్రజలు వెళ్లగొడితే.. విశాఖపై పడ్డారని మండిపడ్డారు. ఆయనకు ఇదే ఆఖరి నియోజకవర్గం అవుతుందని జోస్యం చెప్పారు.
(ఇక ‘ఉత్త’ర గంట)
గంటా అవినీతిపై సిట్ రిపోర్టు బయటపెట్టి ఉంటే పోటీ చేయడానికి అర్హత లేకుండా పోయేదని పేర్కొన్నాడు. పేదలను దోచుకునే స్థాయికి మంత్రి దిగజారడం సిగ్గుచేటన్నారు. అన్ని పార్టీలు గంటాకు టికెట్ నిరాకరించాయని.. దీంతో గత్యంతరం లేకే టీడీపీని పట్టుకొని వేలాడుతన్నారన్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద శాతం అతడిని ఓడించడానికే ఇక్కడి నుంచి పోటీ చేస్తునాన్నని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్రానికి పట్టిన అవినీతి చీడ పురుగును ఓడిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment