
బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి(పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రజలకు రౌడీలు, గూండాల నుంచి బెదిరింపులు వచ్చేవన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీల పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రుల, ఎమ్మెల్యేల పేషీలు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయన్నారు. మంత్రులు కృష్ణారావు, పద్మారావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, దుర్గం చిన్నయ్యలు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేలు, మంత్రులే రౌడీల్లాగా వ్యవహరిస్తే ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో 30 ఎకరాల దళితుల భూమి కబ్జా చేశారనే ఆరోపణలు వస్తే.. వాటిలో వాస్తవాలు ఇప్పటివరకు తేలలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులను బెదిరించిన మంత్రి జూపల్లిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.