కమీషన్ల పాపమే ఫ్యాక్టరీలు: బాణాల | BJP Leaders Criticize On Congress | Sakshi
Sakshi News home page

కమీషన్ల పాపమే ఫ్యాక్టరీలు: బాణాల

Published Wed, May 30 2018 12:08 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

BJP Leaders Criticize On Congress - Sakshi

మాట్లాడుతున్న బాణాల లక్ష్మారెడ్డి

భిక్కనూరు : టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల కమీషన్ల పాపమే భిక్కనూరు మండలంలో విచ్చల విడిగా కెమికల్‌ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ మండల కార్యకర్తల విస్తృస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో విచ్చలవిడగా కెమికల్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు కావడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందన్నారు. మూడేళ్లలో మండల ప్రజలు అనారోగ్యం పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు కెమికల్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాల దగ్గర కమీషన్లు తీసుకుంటూ ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నారన్నారు.

కెమికల్‌ ఫ్యాక్టరీల నుంచి దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ప్రజలు ఆందోళన చేస్తే అధికార పార్టీ నేతలు పోలీసుల చేత కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేయడం సిగ్గుచేటని, పది రోజుల్లో కెమికల్‌ ఫ్యాక్టరీలను మూసివేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, కెమికల్‌ ఫ్యాక్టరీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు సమష్టిగా కృషిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడాలని సూచించారు. వార్డుస్థాయి నుంచి జడ్‌పిటిసి వరకు కార్యకర్తలు పోటీలో ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ప్రజల చూపు... బీజేపీ వైపు
టీఆర్‌ఎస్‌ పాలనతో విస్తుపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ ఉప్పునూతుల మురళీధర్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్‌ పూర్తిగా నెరవేర్చలేదని, టీఆర్‌ఎస్‌ నేతలు ప్రగల్బాలకే పరిమితమయ్యారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయని, దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతోందన్నారు. కర్ణాటకలో మెజార్టీ ప్రజలు బీజేపీని ఆదరించారని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తుందన్నారు.

పార్టీ అభివృద్ధి కోసం రోజూ గంట సమయాన్ని కేటాయించాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్‌ఎస్‌ నేతల అవినీతి అక్రమాల చిట్టా తయారు చేసి ప్రజలకు వివరించాలని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ తున్కి వేణు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల రవీందర్‌రెడ్డి, భిక్కనూరు మండల అధ్యక్షుడు సిం గం శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు తాటికొండ బాబు, నేతలు ప్రభాకర్‌యాదవ్, డప్పు రవి, రాజిరెడ్డి, యాదగిరి,  రాజేందర్‌రెడ్డి, పుల్లూరి నర్సింలు, ప్రవీణ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, తక్కళ్ల రాజిరెడ్డి, రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement