
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బలపడేందుకు కమలదళం వేగంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా చేరికలను ముమ్మరం చేసింది. పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులను పార్టీలో చేర్పించే కార్యక్రమాన్ని చేపట్టింది. టీడీపీ, కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకొని పార్టీలో చేర్చుకుంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఇంటికి శనివారం వెళ్లి మరీ ఈ మేరకు మాట్లాడగా లక్ష్మణ్ తదితరులు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఇంటికి ఆదివారం వెళ్లి మరీ ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు.
త్వరలోనే మరికొంత మంది టీడీపీ ముఖ్య నేతలను బీజేపీలో చేర్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, చాడ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులను బీజేపీలో చేర్చుకోగా తాజాగా మాజీ ఎంపీ వివేక్‌ను చేర్చుకు న్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్వయంగా వివేక్‌ను షా వద్దకు తీసుకెళ్లారు. భవిష్యత్తులో పార్టీలో వారికి ఇదే గౌరవం కొనసాగుతుందన్న హామీలను ఇస్తూ చేరికలను వేగవంతం చేస్తున్నారు.
టీడీపీ నేతలు పూర్తిగా బీజేపీలోకి వచ్చేలా..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని పదేపదే చెబుతున్న బీజేపీ... గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీడీపీ నేతలను అందరినీ బీజేపీలో చేర్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించేందుకు బీజేపీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది.