
సాక్షి, బెంగుళూరు : బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు. దేవభూమిగా పేరొందిన గడ్డపై ఆవు మాంసం తినడంతోనే ఇంతటి ప్రకృతి విపత్తుకు గురైందని అన్నారు. పశుమాంసం తినేవారెవరైనా దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ‘చూడండి కేరళలో ఏం జరిగిందో..! దేవ భూమిగా పేరొందిన చోట విచ్చలవిడిగా ఆవు మాంసం విక్రయాలు చేశారు. బీఫ్ ఫెస్టివల్‌తో విర్రవీగారు. ఆ ఫెస్టివల్ చేసుకున్న ఏడాదిలోనే ఇంతటి ప్రకృతి విలయం సంభవించింద’ని శుక్రవారం జగిరిన విలేకర్ల సమావేశంలో ఎద్దేవా చేశారు. బసనగౌడ విజయపుర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కాగా, పశు మాంసం అమ్మకాలను నిషేదిస్తూ 2017లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా కేరళకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీఫ్ ఫెస్టివల్ పేరిట కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య స్పందించారు. ప్రజల్ని రెచ్చగొట్టే, వారి మనోభావాలు దెబ్బతీసేలా మట్లాడడం బీజేపీ నేతలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ప్రకృతి విపత్తులు సంభవించాయన్నారు. ప్రజల అలవాట్లతో ప్రకృతి విధ్వంసానికి ముడి పెట్టొద్దని హితవు పలికారు. జేడీఎస్ జాతీయ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ కూడా బసనగౌడపై మండిపడ్డారు. సమాజానికి ఉపయోగపడని బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో కాలం వెళ్లదీస్తారని చురకలంటించారు.

Comments
Please login to add a commentAdd a comment