బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై వివాదం
తీవ్రంగా దుయ్యబట్టిన కాంగ్రెస్
అవి వ్యక్తిగత వ్యాఖ్యలన్న బీజేపీ
బెంగళూరు/న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని సవరించేందుకు వీలుగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ కట్టబెట్టాలంటూ ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని కర్వార్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగానికి కాంగ్రెస్ హయాంలో పలు మార్పుచేర్పులు చేసి అనవసర అంశాలతో నింపేశారు.
ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణగదొక్కే చట్టాలను చేర్చారు. ఇలాంటి తప్పిదాలన్నింటినీ సరిచేయాల్సి ఉంది. ఇందుకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ బీజేపీకి మూడింత రెండొంతుల మెజారిటీ అవసరం’’ అని హెగ్డే అన్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగాన్ని తిరగరాసి సర్వనాశనం చేయాలన్న బీజేపీ, ఆరెస్సెస్ రహస్య అజెండా మరోసారి బట్టబయలైందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు.
మున్ముందు ఎన్నికలతో నిమిత్తమే లేకుండా నియంతృత్వ పాలనకు తెర తీసేందుకు మోదీ సర్కారు ప్రయతి్నస్తోందని ఎక్స్‌లో ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఎలాగోలా సర్వనాశనం చేయాలన్న ప్రధాని మోదీ, సంఘ్ పరివార్ ఉద్దేశాలే హెగ్డే నోట వెలువడ్డాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. వారికి న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యమంటే అంతులేని విద్వేషమని ఆరోపించారు.
‘బీజేపీని ఓడిద్దాం, రాజ్యాంగాన్ని రక్షిద్దాం’ అంటూ కాంగ్రెస్ నేతలు తమ సోషల్ అకౌంట్లలో హాష్‌ట్యాగ్ జోడించారు. దాంతో ఈ వివాదంపై బీజేపీ ఆచితూచి స్పందించింది. హెగ్డే వ్యాఖ్యలు వ్యక్తిగతమని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. వాటిపై ఆయనను వివరణ కోరతామని తెలిపారు. హెగ్డే బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరు. ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. హిందూ అతివాద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment