
సాక్షి, అమరావతి : ఏపీకి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది లక్షలకు పైగా ఇళ్లను కేటాయిస్తే.. టెక్నాలజీ పేరుతో చంద్రబాబు నాయుడు వాటిలో కూడా అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. పేదలకు ఉచిత ఇల్లే నా కల అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్తుంటే.. పేదలకు అద్దె ఇల్లే నా కల అని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కట్టే ఇళ్లల్లో గాలి, వెలుతురు సరిగా రావడం లేదన్నారు. బుధవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పించిందని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో బీసీలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ విషయం గురించే మరిచిపోయారని విమర్శించారు. రుణమాఫి చేయకుండా ఎన్నికల వేళ డ్వాక్రా మహిళలకు రూ. 10వేలు ఇస్తూ మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వృద్ధుల పెన్షన్లు రూ.1000 నుంచి రూ.2000 పెంచాలని ఎన్నికల రోజుల్లో గుర్తొంచిందా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి సింహభాగం నిధులు కేంద్రం కేటాయించిదని చెప్పారు. ఐదేళ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేయని చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment