
పట్టపగలు టీవీలో ఒకాయన రాష్ట్ర పౌరులకు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు! ఆయన ముఖంలో ఎమోషన్ ఉంది. మాటల్లో స్లో మోషన్ ఉంది. మాట్లాడినంతసేపు మాట్లాడి.. ‘‘ఇక ఈ రాష్ట్రాన్ని చంద్రబాబే కాపాడాలి’’ అన్నాడు!
‘ఎవరాయన మాట్లాడుతున్నది..’ అని టీవీ చూస్తున్న పౌరులకు సందేహం కలిగింది.
అప్పటి వరకు టీవీ దగ్గర లేని ఒక పౌరుడు టీవీ దగ్గరకు వచ్చి, ‘‘అరె! మాట్లాడుతున్నది చంద్రబాబు కాదా! చంద్రబాబు అనుకున్నానే..’’ అన్నాడు.
అక్కడితో ఊరుకోలేదు.. ‘‘ఈ రాష్ట్రాన్ని చంద్రబాబే కాపాడాలి’ అని చంద్రబాబే ఎందుకంటున్నాడబ్బా అనుకుని వచ్చాను’’ అన్నాడు.
అక్కడితోనూ ఊరుకోలేదు. ‘‘ఎవరీయన.. మాట్లాడుతున్నదీ’’ అన్నాడు.
పక్కనే ఉన్న పౌరుడు స్పందించాడు.
‘‘టీవీ చూస్తున్న మేమే ఈయనెవరో తెలియక చానళ్లు మారుస్తున్నాం. టీవీ చూడకుండా ఈయన చంద్రబాబు అయి ఉంటాడని ఎందుకనుకున్నావ్?’’ అన్నాడు.. గొప్ప అప్రీసియేషన్‌తో.
‘‘అప్పుడా మధ్య టీవీలో చంద్రబాబు వరుసగా రోజుకొక్క శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఇలాగే.. స్లో మోషన్‌లో గంటలు గంటలు మాట్లాడారు. ఆ వాయిస్ గుర్తొచ్చి, మళ్లీ ఇంకో స్లో మోషనేమోనని బయటికి వచ్చా..’’ అన్నాడు ఆ పౌరుడు.
టీవీలో ఆ ఆకస్మిక అపరిచితుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు.
‘నిజమే. చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఆ నాలుగు రోజులూ మాట్లాడిన టోన్‌లోనే ఈయనా స్లోగా మాట్లాడుతున్నాడు..’ అనుకున్నారు అక్కడున్న టీవీ పౌరులు.
‘‘గురూ గారూ.. చేశానని చెప్పుకునేటప్పుడు స్లో మోషన్‌లో, చేస్తానని చెప్పుకునేటప్పుడు రైజింగ్ మోషన్‌లో చంద్రబాబు ఎందుకు మాట్లాడతారంటారూ.. పాలిటిక్స్‌లో అదేమైనా టాక్టికా..’’ అని పౌరుల్లో ఒకరు డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశారు.
‘‘చేయంది చేశానని చెప్పడానికి మనస్సాక్షి ఒప్పుకోదు. అందుకే స్లో మోషన్. చేయలేనిది చేస్తానని చెప్పకపోతే ఎలక్షన్‌లు ఊరుకోవు. అందుకే రైజింగ్ మోషన్’’ అన్నాడు చంద్రబాబును రెగ్యులర్‌గా ఫాలో అవుతుండే పౌరుడొకడు.
టీవీలో ఆ మనిషింకా మాట్లాడుతూనే ఉన్నాడు.
‘‘చంద్రబాబే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి’’ అంటున్నాడు.
‘‘దేని గురించి మాట్లాడుతున్నాడు’’ అని టీవీకి దగ్గరగా జరిగారు పౌరులు.
‘‘చంద్రబాబు తప్ప, ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు’’ అంటున్నాడు అపరిచితుడు.
పౌరులు డిస్కషన్‌లో పడ్డారు. చంద్రబాబు తిరుపతి నుంచి వచ్చేవరకు టెంపో పడిపోకుండా ఉండడానికి అతడు మాట్లాడుతున్నాడని వాళ్లకు అర్థమైంది.
-మాధవ్