‘మోదీ మళ్లీ ప్రధాని కావాలని చంద్రబాబు తీర్మానం’ | BJP MP GVL Narasimha Rao Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 4 2018 11:58 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

BJP MP GVL Narasimha Rao Fires on Chandrababu - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్‌ నరసింహారావు

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కొద్ది నెలలుగా బీజేపీపై ఆర్గనైజ్డ్‌ దుష్ప్రచారం జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిధులు ఇతర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి  అవాస్తవాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు  ఇటీవలి కాలంలో గుజరాత్ కు సంబంధించి వల్లభాయ్ పటేల్ ప్రాజెక్ట్ కోసం కేంద్రం 3000 కోట్ల రూపాయల మేరకు నిధులు ఇచ్చినట్టు ఒక అబద్ధపు ప్రకటన చేశారని దుయ్యబట్టారు. ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమేనని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా కేంద్రం రూ.1000 కోట్లు నిధులు కేటాయిస్తే ఇప్పటివరకు కేవలం రూ.230 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును వారు తప్పుబట్టారు. అవినీతి సంపాదనపై దృష్టి తగ్గించి చంద్రబాబు ఇకనైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రి కావాలని ఎన్డీఏ పక్షాల తరఫున 2017 ఏప్రిల్ 17న తీర్మానం చేసిన చంద్రబాబు డిసెంబర్ నాటికి తన వైఖరి ఎందుకు మార్చుకున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో అబద్దాలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు.

బాబు అతితెలివికి నిదర్శనం
బీజేపీ, వైఎస్సార్‌సీపీకి అక్రమ సంబంధం అంటగట్టి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది చంద్రబాబు అతి తెలివికి నిదర్శనమని దుయ్యబట్టారు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ, ఓ అపరిచితుడిలా మారారని ధ్వజమెత్తారు. ఇతరులపై బురదజల్లి పారిపోయే విధానాలకు చంద్రబాబు  ఇకనైనా స్వస్తి చెప్పాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని ఈ సందర్భంగా కన్నా ఆరోపించారు. దొడ్డిదారిలో పదోన్నతి పొందిన అనుభవం లేని అధికారికి పోలవరం నిర్మాణం బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను పదవి నుంచి తొలగించింది మీరు కాదా అని ప్రశ్నించారు. టీటీడీలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. ఎవరైనా అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే వారిపై పోలీసు కేసులు పెడతారా? కొత్త సంస్కృతిని చంద్రబాబు ప్రవేశ పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేతకానితనంతో ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి వచ్చే నిధులను వాడుకోలేక పోయారని,  ప్రాజెక్ట్‌ల కోసం నివేదికలు ఇవ్వాలని కోరినా చంద్రబాబు నాయుడు నుంచి కనీస స్పందన లేదని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement