బీజేపీ 86.. కాంగ్రెస్‌ పార్టీ 41! | BJP Now More Than Twice As Large As Congress Party In Rajya Sabha | Sakshi
Sakshi News home page

పెద్దల సభలో పుంజుకుంటున్న బీజేపీ బలం!

Published Sat, Jun 20 2020 9:59 PM | Last Updated on Sat, Jun 20 2020 10:37 PM

BJP Now More Than Twice As Large As Congress Party In Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌(ఎన్డీయే) బలం పెద్దల సభలో 100కు పెరిగింది. పదవీకాలం పూర్తవడం సహా ఇతర కారణాల వల్ల ఖాళీ అయిన మొత్తం 61 రాజ్యసభ స్థానాలకు.. 42 సీట్ల ఫలితం తేలగా(అభ్యర్థిత్వాల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం)... మిగిలిన 19 స్థానాలకు శుక్రవారం(జూన్‌ 19న) ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ 8, కాంగ్రెస్‌ పార్టీ 4, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 4, ఇతర పార్టీలు 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇక మొత్తం 61 సభ్యుల్లో 43 మంది సభలో తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. వీరిలో గతంలో లోక్‌సభ ఎంపీలుగా పనిచేసి, 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన జోత్యిరాదిత్య సింధియా, మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు. ఇక వీరితో పాటు మాజీ ప్రధాని హెచ్‌ డీ దేవెగౌడ, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు.  (చదవండి : ఆరేళ్లలో అరవై ఏళ్ల ప్రగతి: జేపీ నడ్డా)

కాగా 2014లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా అధికారం చేపట్టిన సమయంలో రాజ్యసభలో బీజేపీకి తగినంత మెజారిటీ లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగువ సభలో కీలక బిల్లుల ఆమోదం విషయంలో మిత్ర పక్షాలు, ఇతర పార్టీల మద్దతు కూడగట్టాల్సి వచ్చేది. అదే సమయంలో ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ మంది రాజ్యసభ ఎంపీలను కలిగి ఉండటం కూడా ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతికూల అంశంగా ఉండేది. అయితే మోదీ 2.0 సర్కారు ఏర్పాటైన తర్వాత నెమ్మనెమ్మదిగా రాజ్యసభలోనూ బీజేపీ బలం పుంజుకుంటోంది.

ఇక 245 స్థానాలున్న ఎగువ సభలో ప్రస్తుతం ఎన్డీయేకు 100 మంది ఎంపీలు ఉండగా ఏఐఏడీఎంకే(9), బీజేడీ(9) సహా ఇతర పార్టీలు మద్దతు తెలిపినట్లయితే ఈ బలం మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా ఎన్నికలతో పాటు గతంలో ఏకగ్రీవమైన స్థానాలను మొత్తంగా పరిశీలిస్తే.. బీజేపీ 17, కాంగ్రెస్‌ పార్టీ 9, జేడీయూ 3, బీజేడీ 4, టీఎంసీ 4, ఏఐఏడీఎంకే 3, డీఎంకే 3, ఎన్సీపీ 2, ఆర్జేడీ 2, టీఆర్‌ఎస్‌ 2, మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా 245 స్థానాలున్న పెద్దల సభలో సొంతంగా 86 సీట్లతో కాషాయ పార్టీ పట్టు సాధించగా.. కాంగ్రెస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement