సాక్షి, జనగామ: వరుసగా కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం.. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాధరణతో క్షేత్రస్థాయిలో బలోపేతం కావడం కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. జనంలో పలుకుబడి ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకొని రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జిల్లా కేంద్రమైన జనగామ మునిసిపాలిటీలో పాగా వేయడం కోసం ఆ పార్టీ నాయకులు రెండు నెలల నుంచి కసరత్తు ప్రారంభించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీశ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు.
పెరిగిన రాష్ట్ర స్థాయి నేతల పర్యటనలు..
రెండు నెలల క్రితమే మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. అప్పటి నుంచి జిల్లా కేంద్రానికి ఆ పార్టీ ముఖ్య నేతల పర్యటనలు పెంచారు. రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌తో మొదలైన పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఝెండల లక్ష్మీనారాయణ, రఘునందన్‌రావు, కొల్లి మాధవి వంటి రాష్ట్ర నాయకులు జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌తోపాటు మాజీ ఎంపీలు వివేక్, రాపోలు ఆనందభాస్కర్, మాజీ మంత్రి విజయరామారావు వంటి నేతలు జిల్లా కేంద్రానికి వచ్చారు.
ఇప్పటికే జనగామ జిల్లా సాధన కమిటీ, జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డితోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బి. శ్రీనివాస్, సీనియర్ నాయకుడు కత్తుల రాజిరెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖులు పార్టీలో చేరయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దళిత, గిరిజన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం, రాజకీయాలతో సంబంధం ఉండడంతో వారు చేరితే పార్టీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.
క్లస్టర్, కోర్ కమిటీల ఏర్పాటు..
పార్టీని బలోపేతం చేయడంతోపాటు మునిసిపాలిటీ ఎన్నికలే టార్గెట్‌గా ఆ పార్టీ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్‌గా విభజించారు. భువనగిరి పార్లమెంటు స్థానాన్ని క్లస్టర్‌గా ఏర్పాటు చేసి దుగ్యాల ప్రదీప్‌రావు, మనోహర్‌రెడ్డితోపాటు మరో ముగ్గురు సభ్యులతో క్లస్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీని పరిధిని కోర్ కమిటీగా నియమించారు. కోర్ కమిటీలో ఐదురుగు సభ్యులను నియమించారు. క్లస్టర్, కోర్ కమిటీలను రాష్ట్ర పార్టీ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది.
సూర్యాపేట రోడ్డులో పార్టీ కార్యాలయ నిర్మాణం..
జిల్లా కేంద్రంలో శాశ్వత ప్రతిపాదికగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. సూర్యాపేట రోడ్డులోని 163వ జాతీయ రహదారి బైపాస్ సమీపంలో ఎకరం స్థలం విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. కొత్త కలెక్టరేట్‌కు దగ్గరగా ఉండడంతోపాటు జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందనే కారణంగానే అక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేస్తున్నట్లు పార్గీ వర్గాలు చెబుతున్నాయి. దసరా నాటికి పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment