వరంగల్: వరంగల్ పర్యటనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. భద్రకాళీ మహత్యం, సమ్మక్క సారక్క , రాణి రుద్రమ పౌరషం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేయాలని అన్నారు. కుటుంబాన్నిపెంచి పోషించుకోవడమే ఇరుపార్టీల పని అని ఆరోపించారు. కుటుంబ శ్రేయస్సు కోసమే కేసీఆర్ పరితపిస్తారని ప్రధాని మోదీ అన్నారు.
'అవినీతే వారి ధ‍్యేయం..'
కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆరోపించిన ప్రధాని.. ప్రాజెక్టుల్లో ప్రతీది అవినీతి మయమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అవినీతి దేశమంతా.. కేసీఆర్ అవినీతి రాష్ట్రమంతా తెలుసని అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రమాదకరమని అన్నారు. అవినీతి లేని ప్రాజెక్టు ఏదైనా ఉందా? అని బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిపై దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని చెప్పారు.
'అది ట్రైలర్ మాత్రమే..'
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ మాత్రమే చూపించిందని చెప్పిన ప్రధాని మోదీ.. సభకు హాజరైన జనాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాషాయ విజయం ఖాయమనిపిస్తోందని అన్నారు. కేంద్రాన్ని తిట్టడమే బీఆర్‌ఎస్‌కు తెలిసిన పని అని అన్నారు. 9 ఏళ్లలో బీఆర్‌ఎస్ చేసింది నాలుగే పనులని ఎద‍్దేవా చేశారు.
'నిరుద్యోగులకు మోసం..'
ఉద్యోగాలిస్తామని యువతను బీఆర్‌ఎస్ పార్టీ మోసం చేసిందని మోదీ అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ స్కాంలతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని చెప్పారు. రాష్ట్రంలో 12 యూనివర్శిటీల్లో విద్యార్థుల భవిష్యత్‌లో ఆందోళన నెలకొందని అన్నారు. వేలాది ఉద్యోగ ఖాలీలను నింపకుండా కేసీఆర్ తమాషా చూస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ బృతి ఇవ్వలేదని అన్నారు.
నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన..
వరంగల్‌లో నేడు నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర గొప్పదని ప్రధాని మోదీ అన్నారు. 6 వేల కోట్లతో కొత్త జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 176 కిలోమీటర్ల జాతీయ రహదారులకు పునాది రాయి వేశారు మోదీ. తెలంగాణ ఆర్థిక కేంద్రంగా మారబోతోందని అన్నారు. కాజీపేట రైల్యే వ్యాగన్ యూనిట్‌కు మోదీ శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి: రూ.6 వేల కోట్లతో నూతన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment